Crime News: ఐపీఎస్‌ అధికారిణికి మెసేజ్‌లు.. అమెరికా నుంచి వచ్చి అరెస్ట్‌

అమెరికాలో ఉంటున్న ఓ ట్రక్‌ డ్రైవర్‌ ఓ ఐపీఎస్‌ అధికారిణికి సంక్షిప్త సందేశాలు పంపి.. ఆమెను కలిసేందుకు వచ్చి.. హైదరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు

Published : 11 May 2022 06:51 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: అమెరికాలో ఉంటున్న ఓ ట్రక్‌ డ్రైవర్‌ ఓ ఐపీఎస్‌ అధికారిణికి సంక్షిప్త సందేశాలు పంపి.. ఆమెను కలిసేందుకు వచ్చి.. హైదరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ సమీపంలోని తర్న్‌తరన్‌ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్‌ సింగ్‌ అలౌక్‌(29) కాలిఫోర్నియాలో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గ్రీన్‌కార్డు సైతం ఉంది. పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ఐపీఎస్‌ అధికారిణికి అతను కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో సంక్షిప్త సందేశాలు పంపుతున్నాడు. ఆమె జనవరి 17 నుంచి ఏప్రిల్‌ 29 వరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులోని ఓఅతిథి గృహంలో ఉంటున్నారు. మల్‌రాజ్‌సింగ్‌ అలౌక్‌ ఆమెకోసం అమెరికా నుంచి నేరుగా పంజాబ్‌ వచ్చాడు. హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నట్లు తెలుసుకొని నేరుగా ఇక్కడికి వచ్చాడు. ఈనెల 1న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి వెళ్లి వివరాలు తెలుసుకొని అధికారిణి ఉంటున్న అతిథిగృహం వద్దకు వెళ్లాడు. అలౌక్‌తో మాట్లాడటానికి ఆమె నిరాకరించి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని