Published : 22 May 2022 05:52 IST

‘పల్లెప్రగతి’ బిల్లులు రాక సర్పంచి ఆత్మహత్యాయత్నం

నిర్మల్‌, లింగాల, కందనూలు - న్యూస్‌టుడే: ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించడం లేదంటూ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఓ సర్పంచి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. లింగాల మండలం అవుసలికుంట సర్పంచి బండి ఎల్లయ్య గురువారం సాయంత్రం పురుగుల మందు తాగగా.. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. 2020 నుంచి పల్లెప్రగతి పనుల్లో భాగంగా రూ.9 లక్షలు అప్పు చేసి గ్రామంలో అంతర్గత రోడ్లపై మొరం, కంప చెట్ల తొలగింపు, వైకుంఠధామం నిర్మాణం తదితర పనులు చేయించారు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.11 లక్షలైంది. తాను కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన సర్పంచి అయినందుకే అధికారులు పక్షపాత వైఖరి అవలంబించారని.. తనపై రెండుసార్లు సస్పెన్షన్‌ వేటు వేశారని ఎల్లయ్య తెలిపారు. బిల్లుల చెల్లింపుపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగినట్లు చెప్పారు. మరోవైపు రూ.9.89 లక్షల చెక్కును ఉప సర్పంచికి బుధవారమే అందజేసినట్లు ఎంపీడీవో గీతాంజలి పేర్కొన్నారు.

నిధులు విడుదల చేయాలంటూ సర్పంచుల ఆందోళన

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం నిర్వహించతలపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి అవగాహన సదస్సుకు కాసేపు ఆటంకం ఏర్పడింది. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులకు నిధులు విడుదల చేయాలని.. పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులను అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం సరికాదంటూ పలువురు సర్పంచులు ఆందోళన చేపట్టారు. భవనం ఎదుట బైౖఠాయించి నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు కలెక్టరేట్‌లోనే ఉండిపోయారు. పట్టణ సీఐ శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఈశ్వర్‌ సర్పంచులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. పార్టీలకతీతంగా చేపట్టిన నిరసనను అడ్డుకోవద్దని, తమకు న్యాయం చేయాలని కోరారు. మంత్రితో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని