ఉద్యోగాల ఎర.. మయన్మార్‌లో చెర

డేటా ఎంట్రీ ఉద్యోగాల ఆశ చూపి భారతీయ టెకీలను విదేశాలకు రప్పిస్తున్న ముఠాలు.. తర్వాత బలవంతంగా క్రిప్టోకరెన్సీ మోసాలు చేయిస్తున్న ఉదంతమిది. ఆకర్షణీయమైన వేతనాలు

Updated : 24 Sep 2022 05:41 IST

అడవుల్లో కేరళ, తమిళనాడు టెకీల నిర్బంధం

బలవంతంగా క్రిప్టోకరెన్సీ మోసాలు చేయిస్తున్న ముఠాలు

ఈనాడు, హైదరాబాద్‌: డేటా ఎంట్రీ ఉద్యోగాల ఆశ చూపి భారతీయ టెకీలను విదేశాలకు రప్పిస్తున్న ముఠాలు.. తర్వాత బలవంతంగా క్రిప్టోకరెన్సీ మోసాలు చేయిస్తున్న ఉదంతమిది. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తామని సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ బాధితుల్ని థాయ్‌లాండ్‌కు రప్పిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) గుర్తించింది. 100-150 మంది భారతీయ టెకీలను ఇలా థాయ్‌లాండ్‌కు రప్పించి.. అక్కడి నుంచి మయన్మార్‌లో ఉన్న మయవాడీ ప్రాంత అడవుల్లోని రహస్య శిబిరాల్లో బంధించినట్లు వెల్లడైంది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడులకు చెందినవారు ఇలా బందీలుగా మారినట్లు గుర్తించామని హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ (వలసదారుల రక్షణ) కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. థాయ్‌లాండ్‌, మయన్మార్‌ల నుంచి ఇప్పటివరకు 32 మందిని తిరిగి రప్పించినట్లు పేర్కొంది. అలాంటి బాధితులెవరైనా ఉంటే తమను సంప్రదించాలని సూచించింది. నిర్బంధం నుంచి తిరిగి వచ్చిన బాధితులను విచారించిన క్రమంలో అక్కడి ముఠాల తీరుతెన్నుల గురించి వెల్లడైనట్లు ప్రకటించింది. భారతపౌరులు తమ దేశానికి వచ్చిన తర్వాత వీసా ఇచ్చే విధానం(వీసా ఆన్‌ అరైవల్‌) కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. వాటిలో థాయ్‌లాండ్‌ ఒకటి. దీన్ని ఆసరాగా చేసుకొని ముఠాలు మోసాలకు తెరలేపాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాల పేరిట సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఆకర్షితులైన వారిని తొలుత థాయ్‌లాండ్‌కు రప్పిస్తున్నాయి. భారత్‌లోని కొందరు ఏజెంట్లు అక్కడి ముఠాలకు సహకరిస్తూ.. బాధితుల్ని అక్కడికి పంపించే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. థాయ్‌లాండ్‌కు చేరుకున్న తర్వాత టెకీలను మయవాడీలోని రహస్య శిబిరాలకు తరలిస్తున్నారు. అడవుల్లో ఉన్న ఆ శిబిరాలకు సాయుధులు కాపలాగా ఉంటున్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలు చేయాలని బలవంతం చేస్తున్నారు. అంగీకరించనివారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఫోన్లు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. విడిచిపెట్టేందుకు 3500-7000 అమెరికా డాలర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ డబ్బుల్ని బాధితుల కుటుంబసభ్యులు క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లిస్తేనే విడుదల చేస్తున్నారు. కొందరు టెకీలు ఆకర్షణీయ వేతనాలకు ఆశపడి మోసాలకు అంగీకరిస్తున్నట్లు తేలింది.

చైనా అమ్మాయిల పేరిట ఖాతాలు 

బందీలుగా ఉన్న టెకీలతో దుండగులు.. చైనా అమ్మాయిల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్ని తెరిపిస్తున్నారు. అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో ఉన్నట్లు భ్రమింపజేస్తూ క్రిప్టోకరెన్సీ పెట్టుబడులను ఆకర్షింపజేస్తున్నారు. అలా వచ్చిన సొమ్మును ముఠాలు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నాయి. ఇలా మోసగిస్తున్న పలు కంపెనీలు దుబాయ్‌లో ఉన్నట్లు ఎంఈఏ గుర్తించింది. ఓకేఎక్స్‌ ప్లస్‌, లాజాడా, సూపర్‌ఎనర్జీ గ్రూప్‌, జెన్షన్‌ గ్రూప్‌ ఈ జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని