హైదరాబాద్‌పై ఆరు‘గురి’..

తెలంగాణ పోలీసులకు  ఆరుగురు ఉగ్రవాదులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తూ.. అమాయక యువకులను ఉగ్రవాదం వైపు ఉసిగొల్పుతున్నారు. 90లలోనే విదేశాలకు పారిపోయి ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న వీరి విధ్వంస వ్యూహాలను పసిగట్టడం రాష్ట్ర పోలీసులకు సవాలుగా మారింది.

Updated : 04 Oct 2022 05:31 IST

పాకిస్థాన్‌లో 20 మంది తెలంగాణ ఉగ్రవాదులు

అక్కడి నుంచే నిరంతరం విధ్వంస వ్యూహాలు

రాష్ట్ర పోలీసులకు తలనొప్పిగా మారిన వైనం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసులకు  ఆరుగురు ఉగ్రవాదులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తూ.. అమాయక యువకులను ఉగ్రవాదం వైపు ఉసిగొల్పుతున్నారు. 90లలోనే విదేశాలకు పారిపోయి ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న వీరి విధ్వంస వ్యూహాలను పసిగట్టడం రాష్ట్ర పోలీసులకు సవాలుగా మారింది. దసరా సందర్భంగా రాజధానిలో పెను విధ్వంసానికి పన్నిన కుట్రపై కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిదే.  దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో నివసిస్తూ.. తమ రాష్ట్రాల్లో విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నారు. వారిలో దాదాపు 20 మంది తెలంగాణకు చెందిన వారుండగా.. ఆరుగురు  క్రియాశీలకంగా నగర యువతతో నిత్యం సంప్రదింపులు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత మూడు దశాబ్దాల్లో హైదరాబాద్‌ లక్ష్యంగా చోటుచేసుకున్న 30కి పైగా ఉగ్రవాద ఘటనల్లో వీరి పాత్ర ఉందని సమాచారం.

వినియోగం సులువుగా ఉండడంతో ఉగ్రవాదులు బాంబులకు బదులు శక్తిమంతమైన గ్రనేడ్‌లు పంపుతున్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇందుకోసమే  ప్లాస్టిక్‌ గ్రనేడ్లు తయారు చేస్తున్నట్లు  గుర్తించారు. ఒక్కసారి అది పేలగానే ప్లాస్టిక్‌ కవచం పేలిపోయి.. చుట్టుపక్కల ఉన్న వారి శరీరాల్లోకి ముక్కలు చొచ్చుకునిపోతాయి. ప్లాస్టిక్‌ ప్రభావానికి శరీరమంతా సెప్టిక్‌ అయి చికిత్స కూడా కష్టమైపోతుంది.

వీడియో సందేశాలతో విధ్వంస రచన!

హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి పాకిస్థాన్‌లో పెద్ద ప్రణాళికే నడిచింది. పాక్‌ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరవేశారు. పేలుళ్ల కోసం మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌ను ఎంపిక చేశారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, పండుగలను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించేందుకు సిద్ధమైన ముగ్గురు నిందితులను నగర సిట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

26 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చేయిస్తున్న ఘోరీ కనుసన్నల్లోనే ఈ కుట్రకు రచన జరిగింది. పాకిస్థాన్‌లో తలదాచుకున్న కరడుగట్టిన ఈ ఉగ్రవాదికి అబు సుఫియాన్‌, సర్దార్‌ సాహెబ్‌, ఫరూ అనే మారుపేర్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 18 మంది ‘స్వయం ప్రకటిత’ ఉగ్రవాదుల్లో ఇతడొకడు. మైనార్టీ సంస్థలో పనిచేసిన ఇతడు 1991లో బయటకు వచ్చాడు. సౌదీ అరేబియా చేరి లష్కరే తోయిబా, జైషే ఈ మహ్మద్‌ తదితర ఉగ్రవాద సంస్థలతో పనిచేస్తున్నాడు. పాకిస్థాన్‌ నుంచి రెచ్చగొట్టే ప్రసంగాలతో తెలంగాణలోని యువతకు వీడియోలు పంపుతున్నాడు.

తాజా కుట్రలో ప్రధాన పాత్రధారి అబ్దుల్‌ జాహెద్‌ సోదరుడు మాజిద్‌.. పాకిస్థాన్‌లో ఘోరీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు. 2005లో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న బంగ్లాదేశ్‌కు చెందిన డాలిన్‌కు జాహెద్‌ వసతి కల్పించాడు. ఈ కేసులో 12 ఏళ్ల పాటు జైల్లో ఉన్న జాహెద్‌ బయటకు వచ్చాకా  ఉగ్రబాట వీడలేదు. సోదరుడు మాజిద్‌ ప్రోత్సాహంతో యువకులను ఉగ్రవాదులుగా తీర్చిదిద్దుతున్నాడు. జాహెద్‌తో పాటు అరెస్టయిన ఇద్దరు నిందితులు మహ్మద్‌ సమీయుద్దీన్‌, మాజ్‌ హసన్‌ ఫరూక్‌లకు కూడా అతివాద చరిత్ర ఉంది. వారు 2018లో ఐసిస్‌లో చేరేందుకు సిరియాకు పయనమవుతుండగా.. ముంబయిలో అరెస్టు చేశారు.

రిక్రూట్‌మెంట్‌, గ్రనేడ్స్‌ రవాణా, పేలుళ్ల కుట్ర బయట పడకుండా ఉగ్రమూకలు జాగ్రత్తలు తీసుకున్నారు. నిఘా సంస్థలకు దొరక్కుండా ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌ను ఉపయోగించారు. దాని ద్వారానే రహస్య సంకేత భాషలో సంప్రదింపులు జరిపారు. ఈ వివరాలను ఆరా తీస్తున్న పోలీసులు.. 20 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు సమాచారం. ఉగ్ర కార్యకలాపాల కోసం పాకిస్థాన్‌ నుంచి హవాలా మార్గంలో రూ.30 లక్షలు జాహెద్‌కు అందినట్లు అనుమానిస్తున్నారు.

నిందితులు చంచల్‌గూడ జైలుకు

ఉగ్రకుట్ర నిందితులు ముగ్గురికీ  సోమవారం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించి హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచారు.  ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేసే అవకాశం ఉంది.


ఆ ఆరుగురు వీరే

1. ఫర్హతుల్లా ఘోరీ (62) అలియాస్‌ అబు సుఫియాన్‌, కూర్మగూడ, సైదాబాద్‌ 

2. ఉస్మాన్‌ బిన్‌ సయీద్‌ (50)అలియాస్‌ హంజా అలియాస్‌ మహ్మద్‌ రమజాన్‌, ఆగపూర

3. సిద్దిఖీ బిన్‌ ఉస్మాన్‌ అలియాస్‌ రఫీక్‌, భవానీనగర్‌, ఆమన్‌నగర్‌

4. సయ్యద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ హుస్సేన్‌ అలియాస్‌ బడా సాజిద్‌ (57), టోలీచౌకి

5. అబ్దుల్‌ భారీ అలియాస్‌ అబూ హంజా (58), యాకుత్‌పుర

6. మాజిద్‌ అలియాస్‌ చోటు (37), మూసారంబాగ్‌

వీరిలో సయ్యద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఒక్కడే కరాచీలో ఉండగా.. మిగతా వారంతా రావల్పిండి కేంద్రంగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని