Hyderabad: వివాహితపై కానిస్టేబుల్‌ అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌ ఓ వివాహితపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.

Updated : 17 Nov 2022 11:12 IST

నగ్న చిత్రాలు సేకరించి బెదిరింపులు
రిమాండ్‌కు తరలింపు

ఈనాడు- హైదరాబాద్‌, బాలాపూర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌ ఓ వివాహితపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగ్నచిత్రాలు, వీడియోలు సేకరించి తనపై ఉన్న పాత కేసును ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగిన దారుణం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచి కానిస్టేబుల్‌ పి.వెంకటేశ్వర్లు (30)ను ఈ నెల 14న అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

మీర్‌పేట పరిధిలో ఉంటున్న ఓ వివాహిత కుటుంబం గతంలో సైదాబాద్‌లో నివసించేది. మాదన్నపేట ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి.వెంకటేశ్వర్లు వారి ఇంటి సమీపంలోనే నివసించేవాడు. బాధిత వివాహిత, కానిస్టేబుల్‌ భార్య ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అతణ్ని తిరస్కరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. దాంతో బాధితురాలు సైదాబాద్‌ ఠాణాలో 2021 జనవరిలో ఫిర్యాదు చేయగా పోలీసులు అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. నిందితుడు ఇవేవీ పట్టించుకోకుండా మరింత వేధించాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు మరోసారి సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా 2021 మే నెలలో వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బాధితురాలు కుటుంబంతో సహా సికింద్రాబాద్‌కు మారారు. అనంతరం మీర్‌పేటకు వచ్చారు. ఫోన్‌ నంబరు మార్చినా నిందితుడి నుంచి వేధింపులు ఆగలేదు.

కక్ష పెంచుకొని అత్యాచారం

జైలు నుంచి విడుదలైన కానిస్టేబుల్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. బాధితురాలి చిరునామా తెలుసుకున్నాడు. భర్త లేని సమయం చూసి ఆగస్టు 18న ఆమె ఇంటికి వెళ్లాడు. తనకు సహకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత తరచూ ఇంటికెళ్లి దారుణానికి పాల్పడేవాడు. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించి ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించేవాడు. ఈ నెల 14న మధ్యాహ్నం ఆమె ఇంటికెళ్లి తనపై గతంలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. వినకపోవడంతో దాడికి దిగాడు. మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదేరోజు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని