Jadcherla: తాగిన మైకంలో ఇతరుల ఇంట్లోకెళ్లిన ఎస్సై.. చితకబాది చెట్టుకు కట్టేసిన జనం

మద్యం మత్తులో ఉన్న ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) సొంతింటికి బదులు మరో ఇంటి తలుపు తట్టి లోనికి వెళ్లగా, అతనెవరో తెలియని స్థానికులు చితకబాది చెట్టుకు కట్టేశారు.

Updated : 01 Dec 2022 14:13 IST

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఉన్న ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) సొంతింటికి బదులు మరో ఇంటి తలుపు తట్టి లోనికి వెళ్లగా, అతనెవరో తెలియని స్థానికులు చితకబాది చెట్టుకు కట్టేశారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. జిల్లాలోని ఓ ఠాణాకు చెందిన ఎస్సై మద్యం తాగారు. ఆ మైకంలోనే బుధవారం తెల్లవారుజామున వాహనంలో ఇంటికి బయలుదేరారు. ఆయన అద్దెకు ఉండే ఇంటికి వెళ్లే దారిలో శుభకార్యం జరుగుతుండటంతో టెంటు వేశారు. వాహనం ఇంటి వరకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో వెంట వచ్చిన డ్రైవర్‌ దాన్ని పక్క వీధిలో నిలిపి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎస్సై తన ఇంటికి మరో దారి గుండా నడచుకుంటూ వెళ్లారు. మద్యం మత్తులో ఉండటంతో పొరపాటున తన ఇల్లు అనుకొని ఇతరుల ఇంటి తలుపు తట్టారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఎవరో అనుకుని ఇంటివారితో పాటు కాలనీవాసులు ఆయన్ని పట్టుకొని చితకబాదారు. సాధారణ దుస్తుల్లో ఉండటంతో వచ్చింది ఎస్సై అని తెలియలేదు. అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా చెట్టుకు కట్టేశారు. ఇదంతా జరిగాక ఆ వచ్చింది ఎస్సై అని తెలిసింది. తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులు తీసిన వీడియోలు, ఫొటోలను సెల్‌ఫోన్ల నుంచి తొలగించారు. ఈ విషయంపై స్థానికులను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా భయాందోళనతో వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. ఎస్సైని వివరణ కోరగా చిన్న గొడవ జరిగిందంటూ వివరాలు తెలిపేందుకు ఇష్టపడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని