ఉపాధికెళ్లి... ఊపిరి తీసుకుని..

ఆమెది నిరుపేద కుటుంబం. మిఠాయి దుకాణంలో పనిచేస్తూ.. అరకొర సంపాదనతో కుటుంబం గడవడం కష్టమనుకున్నారు. గల్ఫ్‌ దేశానికి వెళ్లి డబ్బులు సంపాదించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని భావించారు.

Published : 04 Dec 2022 07:28 IST

గల్ఫ్‌లో విషాదాంతం

రాజోలు, న్యూస్‌టుడే: ఆమెది నిరుపేద కుటుంబం. మిఠాయి దుకాణంలో పనిచేస్తూ.. అరకొర సంపాదనతో కుటుంబం గడవడం కష్టమనుకున్నారు. గల్ఫ్‌ దేశానికి వెళ్లి డబ్బులు సంపాదించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని భావించారు. ఏజెంట్ల మాటలు నమ్మి గల్ఫ్‌ వెళ్లారు. అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక.. ఇంటికి వచ్చే అవకాశం లేక.. ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గత నెల 28వ తేదీన జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. రాజోలు ఎస్సై కృష్ణమాచారి తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన కోజా వెంకటలక్ష్మి(30)ది నిరుపేద కుటుంబం. ఆమె రాజోలుకు చెందిన ఏజెంట్‌ జిలానీ ద్వారా ఆరు నెలల క్రితం మస్కట్‌ వెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో పనికి కుదిరారు. అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఇబ్బందులు తాళలేక అక్కడి నుంచి స్వదేశానికి వచ్చేస్తానని భర్త నాగరాజుకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన ఏజెంట్లను అడిగితే.. వాళ్లు డబ్బులు డిమాండు చేశారు. తాము పేదరికంలో ఉన్నామని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో స్వదేశానికి వచ్చే మార్గం లేదని తెలిసిన వెంకటలక్ష్మి.. గత నెల 28న భర్తకు వీడియోకాల్‌ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్యను పంపిన ఏజెంట్లకు గల్ఫ్‌ దేశాలకు పంపడానికి అనుమతులు లేవని, వారు మోసం చేసి పంపారని మృతురాలి భర్త నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు