Crime News: పెద్దలకు చెప్పలేక.. ప్రాణాలు తీసుకున్నారు

వారిద్దరూ మేజర్లే.. పరస్పరం ఇష్టపడ్డారు. కానీ.. ప్రేమ విషయం పెద్దలకు చెప్పుకోలేకపోయారు. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. కన్నవారికి కడుపు కోత మిగిల్చారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా

Updated : 25 Oct 2021 10:42 IST

నల్గొండ జిల్లాలో ప్రేమజంట విషాదాంతం

తిరుమలగిరి(సాగర్‌), న్యూస్‌టుడే: వారిద్దరూ మేజర్లే.. పరస్పరం ఇష్టపడ్డారు. కానీ.. ప్రేమ విషయం పెద్దలకు చెప్పుకోలేకపోయారు. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. కన్నవారికి కడుపు కోత మిగిల్చారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం తెట్టెకుంట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. తెట్టెకుంటకు చెందిన ఉగ్గిరి నాగయ్య, సైదమ్మ దంపతులకు కుమారుడు వెంకటేశ్వర్లు, కుమార్తె సంధ్య(20) సంతానం. ఇంటర్‌ పూర్తిచేసిన సంధ్య.. వ్యవసాయ పనులకు వెళ్తుండేది. గతేడాది రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వర్లు చనిపోయాడు. ఇతడి స్నేహితుడు, వీరింటి సమీపంలోనే ఉండే మట్టిపల్లి కొండలు(22) మిత్రుడు చనిపోయినప్పటి నుంచి బాధిత కుటుంబానికి సాయంగా ఉండేవాడు. ఈ క్రమంలో సంధ్య, కొండలు ప్రేమించుకున్నారు. ఇది తెలియని సంధ్య తల్లిదండ్రులు.. ఆమెకు దగ్గరి బంధువుల అబ్బాయితో సంబంధం మాట్లాడి, నిశ్చితార్థం చేశారు. ఈనెల 22న సంధ్యను, వాళ్ల నాయనమ్మను ఇంటి వద్ద ఉంచి పెళ్లి తేదీని నిర్ణయించడానికి ఊరెళ్లారు. ఆ సమయంలో బయట ఏకాంతంగా మాట్లాడుకున్న కొండలు, సంధ్య.. తమ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియజేస్తే ఏమవుతుందోనని భయపడ్డారు. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. అక్కడే పురుగుల మందు తాగేశారు. తర్వాత సంధ్య ఇంటికి వెళ్లింది. వాంతులు చేసుకోవడంతో వాసన పసిగట్టిన సంధ్య నాయనమ్మ కేకలు వేశారు. స్థానికులు సంధ్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరగా.. కొండలు అడ్డువచ్చి ఇద్దరినీ బతికించాలని వేడుకున్నాడు. వారిద్దరినీ హాలియాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అబ్బాయి పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు అతన్ని నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంధ్యను నార్కట్‌పల్లిలో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు పాయిజన్‌ కేసులు తీసుకోబోమని చెప్పడంతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం కొండలు, అదేరోజు రాత్రి సంధ్య తుదిశ్వాస విడిచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు