Triangular love story: ముక్కోణపు ప్రేమకథకు.. 5స్టార్‌ హోటల్‌లో ముగింపు!

ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపిన ఓ యువతి.. పరిస్థితులు వ్యతిరేకంగా మారడంతో పక్కా ప్లాన్‌ ప్రకారం అందులో ఒకరిని, మరో ప్రియుడి సాయంతో హతమార్చింది. 

Updated : 06 Feb 2024 18:54 IST

గువాహటి: ఓ ముక్కోణపు ప్రేమ కథ (Triangular love story)..5 స్టార్‌ హోటల్‌లో ముగిసింది. ఇద్దరితో ప్రేమ వ్యవహారం సాగించిన యువతి.. పరిస్థితులు వ్యతిరేకంగా మారడంతో పక్కా ప్లాన్‌ ప్రకారం అందులో ఒకరిని కడతేర్చింది. ఇందుకు ఆమె మరో ప్రియుడు కూడా సహకరించాడు. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో సోమవారం చోటుచేసుకుంది. నిందితులిద్దరూ కోల్‌కతా (kolkata)కు చెందినవారు కాగా, మృతుడు మహారాష్ట్రలోని (Maharashtra) పుణెకి చెందినవాడు. పోలీసుల వివరాల ప్రకారం.. 25 ఏళ్ల అంజలి షా అనే యువతి కోల్‌కతా విమానాశ్రయంలో రెస్టారంట్‌లో పనిచేస్తోంది. ఆమెకు 27 ఏళ్ల రాకేశ్‌ అనే బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. అయితే, ఏడాది క్రితం పుణెకి చెందిన సందీప్‌ సురేశ్‌ కాంబ్లీ (42) అనే కారు డీలర్‌తో అంజలికి పరిచయం ఏర్పడింది. అది కాస్త శారీరకంగా దగ్గరయ్యేవరకు వెళ్లింది. ఆ సమయంలో తామిద్దరూ సన్నిహితంగా ఉండే ఫొటోలు తీసిన కాంబ్లీ.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. 

దీంతో ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు రాకేశ్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి ఎలాగైనా కాంబ్లీని అంతమొందించాలనుకున్నారు. తొలుత అతడిని కోల్‌కతాకు రప్పించి హత్య చేయాలనుకున్నారు. ప్లాన్‌లో భాగంగా అంజలి.. కాంబ్లీకి ఫోన్‌ చేసి కోల్‌కతా రావాలని కోరింది. అక్కడికి రావడం కుదరదని, సోమవారం గువాహటి రావాలని డేట్‌ ఫిక్స్‌ చేశాడు. అక్కడే  ఓ 5స్టార్‌ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశాడు. విషయం తెలుసుకున్న రాకేశ్‌.. అదే హోటల్‌లో వేరే రూమ్‌ తీసుకున్నాడు. అంజలి, కాంబ్లీ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తలుపు కొట్టి.. లోపలికి వెళ్లి అతడిపై దాడి చేశాడు. కుప్పకూలిన కాంబ్లీని అక్కడే వదిలేసి..  అతడి మొబైల్‌ తీసుకొని ఇద్దరూ పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత హోటల్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. వారు వెళ్లి చూసేసరికి.. అతడు చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, ఎయిర్‌పోర్ట్‌ ప్యాసింజర్‌ జాబితాను పరిశీలించి నిందితులను గుర్తించారు. విమానాశ్రయం దగ్గర్లోని ఓ హోటల్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంచెం ఆలస్యమైతే రాత్రి 9.15కి కోల్‌కతాకు విమానంలో వెళ్లిపోయేవారని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు