అయ్యో ఘోరం! అదృశ్యమై.. ఇంట్లోనే పెట్టెలో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు!

పదేళ్ల వయసు లోపు ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమై.. ఇంట్లోనే ట్రంకు పెట్టెలో విగతజీవులుగా పడిఉన్న దృశ్యాలు తీవ్ర విషాదం నింపాయి.

Published : 02 Oct 2023 16:09 IST

చండీగఢ్‌: పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే ఓ పెట్టెలో విగత జీవులుగా పడి ఉన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముద్దు ముద్దు మాటలతో సందడి చేసే చిన్నారులు కాంచన (4), శక్తి (7), అమృత (9) ఇక తమ మధ్య లేరన్న వార్తతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జలంధర జిల్లాలో పనికోసం వలస వచ్చిన దంపతులకు  ఐదుగురు సంతానం. ఆదివారం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ముగ్గురు కుమార్తెలు కనబడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ భార్యాభర్తలు మక్సుదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

అయితే, సోమవారం ఇంట్లోని వస్తువులను ఆ చిన్నారుల తండ్రి వేరే చోటకు తరలిస్తున్న సమయంలో ట్రంకు పెట్టె సాధారణం కన్నా అధిక బరువు ఉండటం గర్తించారు.  దాన్ని తెరిచి చూడగా ఆ పెట్టెలో ముగ్గురు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ చిన్నారుల తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో ఇంటిని ఖాళీ చేయాలని ఇటీవలే ఇంటి యజమాని హుకుం జారీ చేశాడని పోలీసులు తెలిపారు. చిన్నారులు మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఈ మరణాలకు కారణాలను తెలుసుకొనేందుకు వీరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని