TS News: వరంగల్‌లో కొకైన్‌ కలకలం!

వరంగల్‌లో కొకైన్‌ పట్టివేత కలకలం సృష్టించింది. నగరంలోని యువకులు, విద్యార్థులకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్‌, సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు. వరంగల్‌లోని పిన్నావారివీధికి చెందిన శివ్వ రోహన్‌, సైబరాబాద్‌ మాదాపూర్‌కు

Updated : 06 Nov 2021 06:45 IST

పలు రకాల మత్తు పదార్థాలు స్వాధీనం
ఆరుగురు యువకుల అరెస్టు

కేసు వివరాలను వెల్లడిస్తున్న సీపీ తరుణ్‌జోషి, డీసీపీ కె. పుష్పరెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, సంతోష్‌

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌లో కొకైన్‌ పట్టివేత కలకలం సృష్టించింది. నగరంలోని యువకులు, విద్యార్థులకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్‌, సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు. వరంగల్‌లోని పిన్నావారివీధికి చెందిన శివ్వ రోహన్‌, సైబరాబాద్‌ మాదాపూర్‌కు చెందిన పెంచికల కాశీరావుతో పాటు మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గ్రామున్నర కొకైన్‌, 15 గ్రాముల చరస్‌తో పాటు 36 ఎల్‌ఎస్‌డీ పేపర్లు, మత్తును కలిగించే మాత్రలతో పాటు గంజాయి నుంచి తీసిన నూనె, గంజాయిని పొడి చేసే పరికరం, హుక్కా సామగ్రి, ఆరు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.16 లక్షలు ఉంటుందని అంచనా. శుక్రవారం కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ తరుణ్‌జోషి కేసు వివరాలను వెల్లడించారు.

బీటెక్‌ స్టూడెంట్‌ కొకైన్‌ సరఫరాదారుగా...
ఇంజినీరింగ్‌ చదువుతున్న రోహన్‌ మత్తు పదార్థాలకు అలవాటు పడడంతో పాటు సరఫరా చేస్తుండేవాడు. రోహన్‌ గోవాకు వెళ్లి అక్కడ నైజీరియా దేశానికి చెందిన జాక్‌, కాల్‌జోఫర్‌ల నుంచి కొకైన్‌, చరస్‌, ఇతర మత్తు పదార్థాలను కొనుగోలు చేసి స్నేహితులతో కలిసి వరంగల్‌లో విక్రయించేవాడు. హైదరాబాద్‌కు చెందిన కాశీరావు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గోవాకు వెళ్లి మత్తు పదార్థాలు కొనుగోలు చేసేవాడు. వీరిద్దరికీ పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ కలిసి సరఫరా మొదలుపెట్టారు. వరంగల్‌ నగరంలోని పలు లాడ్జ్‌లలో తమ కార్యకలాపాలు కొనసాగించేవారు. దీనిపై పక్కాగా సమాచారం రావడంతో సుబేదారి, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వరంగల్‌ నక్కలగుట్టలోని లాడ్జ్‌పై దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. ఈ విషయంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌జోన్‌ డీసీపీ కె.పుష్పారెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, సంతోష్‌, సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌, ఎస్సై సాంబమూర్తి, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శ్యాంసుందర్‌, కానిస్టేబుళ్లు మహేందర్‌, సృజన్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ను పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని