jawan: కుమార్తెను కొట్టారని స్కూల్ డైరెక్టర్​పై జవాన్ కాల్పులు..!

హోంవర్క్​ చేయని కుమార్తెను దండించారన్న కోపంతో.. స్కూల్‌  డైరెక్టర్​పై ఓ జవాను కాల్పులకు తెగబడ్డాడు......

Published : 04 Jan 2022 23:23 IST

జైపుర్‌: సైన్యంలో ఉండి దేశానికి సేవ చేయాల్సిన జవాన్​.. తన పరిధి దాటి అతిగా ప్రవర్తించాడు. ముష్కరులపై గురిపెట్టాల్సిన తుపాకీతో.. తన కూతురు చదువుకునే పాఠశాల డైరెక్టర్​పైనే కాల్పులు జరిపాడు. హోంవర్క్​ చేయని కుమార్తెను దండించారన్న కోపంతో.. స్కూల్‌  డైరెక్టర్​పై కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలో ప్రమావదశాత్తు సదరు జవాన్‌ భార్యకే బులెట్​​ తగిలింది.

రాజస్థాన్​ భరత్​పుర్​ జిల్లా కన్వాడా గ్రామానికి చెందిన పప్పు గుర్జార్‌ ఆర్మీలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి కుమార్తె ఓ ప్రైవేట్​ స్కూల్లో చదువుతోంది. అయితే హోంవర్క్​ చేయలేదని ఓ టీచర్​ ఆమెను చెంపదెబ్బ కొట్టగా.. ఈ విషయం తన తండ్రికి తెలియజేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన జవాన్​.. పాఠశాల డైరెక్టర్​ను కలిసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అంతే.. గుర్జార్​ తన జేబులో నుంచి తుపాకీ​ తీసి అతనికి గురిపెట్టాడు. అయితే దీన్ని ఆపేందుకు మధ్యలోకి వచ్చిన జవాన్‌ భార్య భుజానికే.. ఆ బులెట్​ దిగింది. ఘటన జరిగిన స్థలం నుంచి గుర్జార్‌ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. గుర్జార్​ కొద్దిరోజులుగా సెలవులో ఉన్నాడని, సర్వీస్​ రివాల్వర్​నే తన వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అతడి భార్య ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని