logo

అదిగదిగో... వైకుంఠపురం

జిల్లాలో గుంటూరు నగరంతోపాటు మున్సిపల్‌ పట్టణాలు, మండల కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రెవెన్యూశాఖకు పన్ను చెల్లించి వ్యవసాయేతర భూములుగా మార్చుకుంటున్నారు. వీటికి ఆయా పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు

Updated : 20 Jan 2022 06:14 IST

 మాటల గారడీలతో అనధికార లేఔట్లలో ప్లాట్ల విక్రయాలు  
 నిలువునా మోసపోతున్న సామాన్యులు


చిలకలూరిపేటలో అనుమతులు లేకుండా వేసిన లేఔటు

ఈనాడు, గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంతోపాటు మున్సిపల్‌ పట్టణాలు, మండల కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రెవెన్యూశాఖకు పన్ను చెల్లించి వ్యవసాయేతర భూములుగా మార్చుకుంటున్నారు. వీటికి ఆయా పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుమతులు తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో అధికార పార్టీ నేతల సాయంతో యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులు లేకుండానే పని చక్కబెట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వెళ్లి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు అనధికార లేఔటు ప్రాంతంలో అనుమతులు లేవని బోర్డు పెడుతున్నారు. దీనివల్ల సామాన్య జనం అప్పటికే తీవ్రంగా నష్టపోతున్నారు. చిలకలూరిపేట పట్టణానికి సమీపంలో అంటూ పది కిలోమీటర్ల దూరంలో ప్లాట్లు వేసి విక్రయించారు. విజయవాడకు చెందిన వైద్యుడు ఒకరు ప్లాట్ల గురించి వాకబు చేసి అవాక్కయ్యారు. బ్రోచర్‌లో చెప్పినదానికి, వాస్తవానికి ఎంత తేడా అంటూ నిట్టూర్చారు. కొనుగోలు సమయంలో ఇప్పుడే ఇల్లు కట్టుకోం కదా అని అనుమతులు, ఇతరత్రా అంశాలు పరిశీలించకుండానే స్నేహితులు చెప్పారని, ఏజెంట్లు సూచించారని కొనుగోలు చేస్తున్నారు. వీటిని అమ్ముకోవాలన్నా.. ఇల్లు కట్టుకోవాలని ప్లాన్‌కు వెళ్లినా అనుమతులు లేని విషయం తెలిసి పన్నుల భారం మోయలేక సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

*కోటప్పకొండకు చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణం.. కాలుష్యానికి పూర్తిగా దూరం.. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి నుంచి నిమిషాల వ్యవధిలో ప్రయాణం.. ఎలాంటి అనుమతులు లేకుండా లేఔట్‌ వేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కల్పిస్తున్న ప్రచారం ఇదీ..

*సూర్యలంక బీచ్‌కు సమీపంలోని రిసార్టులు పక్కనే ప్లాట్లు.. భవిష్యత్తులో పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది.. పెట్టుబడి పెట్టాలనేకునేవారికి ఇది అద్భుత అవకాశం.. తీర ప్రాంతంలో మరో రియల్‌ సంస్థ ప్రచారం.. ఈ వెంచర్‌కు కూడా ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం.

*కాసులే పరమావధిగా కొంతమంది మాటల గారడీలతో సామాన్య జనాన్ని నిలువునా ముంచుతున్నారు. అదిగదిగో ఆ లేజౌట్‌ మీ భవితకు పెన్నిధి అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. పంట పొలాల్ని ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు కిమ్మనడం లేదు. 

అనుమతి లేనివి కొంటే భారమే
సంబంధిత గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీకి స్థలం రిజిస్ట్రేషన్‌ విలువలో 14 శాతం సొమ్మును చెల్లించాలి. బెటర్‌మెంట్‌ ఛార్జీలు, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు, జరిమానాలు చెల్లించిన తర్వాతే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తారు. ఇంటిప్లాన్‌ ఉంటే తప్ప మిగిలిన అనుమతులు రావు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీ నంబరు ఉన్న వెంచర్లలోనే కొనుగోలు చేయాలి. 

600పైగా అనధికార లేఔట్లు
జిల్లాలోని సీఆర్‌డీఏ పరిధిలో 491 అనధికార లేఔట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా సీఆర్‌డీఏ పరిధి కాకుండా మిగిలిన అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, ఈపూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, బాపట్ల మండలాల పరిధిలో 133 అక్రమ లేఔట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా ఆయా మండల కేంద్రాల్లో పలుచోట్ల అనధికార లేఔట్లు ఉన్నాయి. మామూళ్ల మాటున యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. 

నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
* వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల నిమిత్తం పన్ను చెల్లించాలి.  నీ లేఔటుకు సంబంధించి ప్రతిపాదనలు ఇస్తే పంచాయతీ తీర్మానం చేసి తాత్కాలిక సాంకేతిక అనుమతుల కోసం టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ)కి పంపిస్తారు. 
* తాత్కాలిక సాంకేతిక అనుమతులు వచ్చిన తర్వాత మురుగు కాలువలు, రహదారులు, అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగునీటి సౌకర్యం కల్పించాలి.  నీ రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యంతోపాటు 10శాతం భూమిని సామాజిక అవసరాల కోసం సంబంధిత పంచాయతీకి రిజిస్టర్‌ చేయాలి. 
* నిబంధనల ప్రకారం పనులు పూర్తిచేసిన తర్వాత తుది ఆమోదం కోసం పంచాయతీ నుంచి ప్రతిపాదనలు డీటీసీపీకి వెళతాయి. 
* డీటీసీపీ పంచాయతీ పంపిన తీర్మానాన్ని ఆమోదించి లేఔట్‌ ప్లాన్‌ (ఎల్‌పీ) నంబరు కేటాయిస్తుంది. 


వినుకొండ గ్రామీణ మండలం వెంకుపాలెం గ్రామం పరిధిలో వెలసిన అనధికార లేఔట్లు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని