logo

ముంపు ముప్పుపై ముందుచూపేది?

జిల్లాలో ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. మురుగుకాల్వల్లో పూడిక పేరుకుపోయి వరద రోడ్ల మీద ప్రవహిస్తోంది. కొన్ని కాలనీలు అయితే చెరువులను తలపిస్తాయి.

Published : 06 Jun 2023 04:47 IST

అస్తవ్యస్తంగా మురుగు కాలువలు
కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

ఎల్లాగౌడ్‌తోటలోని మురుగుకాలువలో పూడిక మట్టి, పిచ్చిమొక్కలు  

జిల్లాలో ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. మురుగుకాల్వల్లో పూడిక పేరుకుపోయి వరద రోడ్ల మీద ప్రవహిస్తోంది. కొన్ని కాలనీలు అయితే చెరువులను తలపిస్తాయి. చాలాచోట్ల మురుగు కాల్వలు అధ్వానంగా మారాయి. ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎప్పటి మాదిరిగానే నిర్లక్ష్యం వీడటం లేదు. వెరసి వర్షాకాలంలో ఈసారి సైతం ఇక్కట్లు తప్పేలా లేవు.

ఏటా వర్షాలకు కాగజ్‌నగర్‌ పురపాలిక పరిధిలోని పలు వార్డులు వరద ముంపుతో సతమతం అవుతున్నాయి. అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనికి తోడు కాలువల ఆక్రమణలతో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. పట్టణంలోని పెట్రోల్‌పంపు నుంచి రైల్వే గేటు వరకు దాదాపు 40 అడుగుల వెడల్పుతో పెద్ద నాలా ఉంది. ఈ కాలువ పొడవునా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికితోడు చాలాచోట్ల కాలువలో పిచ్చిమొక్కలు పెరిగి, పూడిక నిండిపోయి అస్తవ్యస్తంగా మారాయి. దీంతో ఓ మోస్తరు వర్షం పడగానే వరదంతా రోడ్డెక్కుతోంది.

ప్రణాళిక కరవు

కాగజ్‌నగర్‌లోని మార్కెట్‌ ఏరియా, సంజీవయ్య కాలనీ, బాలాజీనగర్‌ ఏరియాలకు వర్షాకాలంలో ముంపు ముప్పు పొంచి ఉంది. సర్‌సిల్క్‌ కాలనీలోని ప్రధాన కాలువ ఆక్రమణలకు గురైంది. వాటిని తొలగించి, పొక్లెయిన్ల సాయంతో పూడిక, పిచ్చిమొక్కలను తొలగించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, టెండర్ల ప్రక్రియ చేపట్టాలి. కానీ నేటికీ అధికారులు కనీసం ప్రణాళికను కూడా సిద్ధం చేయలేదు.

* కాపువాడలో మురుగు కాలువ నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేశారు. కాలువలు లేకపోవడంతో వరదనీరు కాలనీని చుట్టుముడుతోంది. స్థానికులు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నా.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు.

అస్తవ్యస్తంగా నిర్మాణాలు..

పట్టణంలోని సంజీవయ్య కాలనీలో రెండేళ్ల క్రితం రూ.45 లక్షల వ్యయంతో మురుగు కాలువ, దానిపై కల్వర్టు నిర్మించారు. నీరు సక్రమంగా పారేలా నిర్మాణం లేకపోవడంతో వరద నీరు నిలిచి ఏటా కాలనీ జలమయం అవుతోంది. ఈ సమస్యను స్థానికులు పలుమార్లు ఇంజినీరింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరవైంది. అయిదేళ్లుగా మిషన్‌ భగీరథ- అర్బన్‌ పథకం కింద పనులు సాగుతున్నాయి. పైపులైన్‌ నిర్మాణం సందర్భంగా గుత్తేదారు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో కాలువలు శిథిలమవుతున్నాయి. వాటికి మరమ్మతులు చేయడం లేదు.

మార్కెట్‌ ఏరియాలో ఆక్రమణకు గురైన మురుగు కాలువ

జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోనూ పలు కాలనీల్లో మురుగుకాలువల నిర్మాణాలు లేక ఇక్కట్లు తప్పడం లేదు. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.


పాలకవర్గం సభ్యుల ఆందోళన

పురపాలిక పరిధిలోని అధికారుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధి పనులు నత్తకంటే హీనంగా సాగుతున్నట్లు మే 29వ తేదీన పురపాలక సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్‌ సమావేశ మందిరంలో నేలపైనే కూర్చుని నిరసన తెలిపిన విషయం విధితమే. అయినప్పటికీ అధికారుల అభివృద్ధి పనుల్లో పురోగతి లేదు. అధికారుల పని తీరుపై పాలకవర్గం సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ప్రణాళిక సిద్ధం చేశాం

పురపాలిక పరిధిలోని ముంపు ప్రాంతాల్లోని మురుగు కాలువల్లో పూడిక తొలగింపునకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. అభివృద్ధి పనులను కూడా సకాలంలో పూర్తయ్యేలా చూస్తా. టెండర్లు పొంది, పనులు ప్రారంభించని గుత్తేదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం.

అంజయ్య, పురపాలిక కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని