icon icon icon
icon icon icon

Chnadrababu: 24 గంటల్లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేస్తా: చంద్రబాబు

ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు.

Published : 09 May 2024 20:52 IST

విశాఖపట్నం: ‘మన ఆస్తులు అమ్ముకోవాలన్నా జగన్‌ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. అందుకే.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేస్తా’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైకాపా నాయకులకు విశాఖపై ప్రేమ లేదని, ఇక్కడి ఆస్తులపైనే ఉందన్నారు. మెడపై కత్తిపెట్టి ఇక్కడి ప్రజల ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు. విశాఖ ప్రజలు తెలివైన వారని, అందుకే  2014లో ఎంతో ముందు చూపుతో విజయమ్మను ఓడించారని గుర్తు చేశారు. గురువారం రాత్రి విశాఖ సీతంపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సొంత చెల్లి చీర రంగు గురించి మాట్లాడే అన్నయ్య ఎవరైనా ఉంటారా? అని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాతో లబ్ధిపొందిన జగన్‌.. ఈ సారి గులకరాయి డ్రామాను తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు. డ్రామాల రాయుడి నాటకాలను  ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. 

‘‘నా జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. అందుకే భయపడను. జైల్లో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు ప్రయత్నించారు. అయినా, భయపడలేదు. అక్కడ కూడా ప్రజల కోసమే ఆలోచించా. వైకాపాకు ఎదురుతిరిగారన్న కారణంతో ఎంపీ రఘురామ కృష్ణ రాజును హింసించారు. సమైక్య రాష్ట్రంలో ముఠా రాజకీయాలను తిప్పికొట్టి.. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాం. అలాంటిది ఈ తాటాకు చప్పుళ్లకు భయపడతానా? వైకాపా అరాచకాలను అంతం  చేయాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలి. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలి. మీ ఓటు పిల్లల భవిష్యత్‌ కోసమని గుర్తుపెట్టుకోవాలి. 

జగన్‌ అధికారంలోకి వస్తే అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోతాయి. గ్రామానికో రౌడీ పుట్టుకొస్తాడు. ఈ ఐదేళ్లు ఎవరైనా బాగుపడ్డారా? ప్రజల ఆదాయం పెరగాలి. ధరలు తగ్గాలి. కానీ, రాష్ట్రంలో భిన్న పరిస్థితులు తలెత్తాయి. ఎనిమిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. విపరీతంగా ధరలు పెంచేశారు. కలుషిత మద్యానికి దాదాపు 31 వేల మంది బలయ్యారు. విశాఖ నగరం గంజాయి, డ్రగ్స్‌కు హబ్‌గా మారిపోయింది. ఒకే మాటను పదేపదే చెబితే  నిజమైపోతుందని జగన్‌ అనుకుంటున్నారు. రుషి కొండకు బోడిగుండు కొట్టేశారు. అక్కడ రూ.500 కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్‌ కట్టేశాడు. అక్కడికి ఎవరినీ రానివ్వడం లేదు. ఈ చర్యలు చూస్తుంటే జగన్‌ అహంకారం అర్థమవుతోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. కేంద్రంలో మోదీ గ్యారంటీలు.. ఇక్కడ సూపర్‌ సిక్స్‌ ఉన్నాయి. డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చి.. వారిని లక్షాధికారులను చేస్తా’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img