Stock market: దలాల్‌ దఢేల్‌: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22 వేల స్థాయిని కోల్పోయింది.

Updated : 09 May 2024 16:19 IST

Stock market | మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Stock market) పతనం కొనసాగుతోంది. గురువారం సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. సార్వత్రిక ఎన్నికలు, మెప్పించని క్యూ4 ఫలితాలు వంటి మార్కెట్‌ సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌లో వెయ్యి పాయింట్లు కోల్పోగా..  నిఫ్టీ 22 వేల స్థాయిని కోల్పోయింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.393 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,499.49 పాయింట్ల (క్రితం ముగింపు 73,466.39) వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,334.18 కనిష్ఠానికి చేరిన సూచీ.. చివరికి 1062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్లు కోల్పోయి 21,957 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర కాస్త పెరిగి 84.16 డాలర్లకు చేరింది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు

కారణాలు ఇవే..

  • సార్వత్రిక ఎన్నికల్లో మూడు దశల్లో పోలింగ్‌ పూర్తయిన వేళ పోలింగ్‌ సరళిపై మదుపరుల్లో ఒకింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం సన్నగిల్లింది. ముందుగా ఊహించినట్లు ఫలితం పూర్తిగా తలకిందులయ్యే అవకాశం లేనప్పటికీ.. ఊహించినట్లుగా ఫలితం ఉండకపోవచ్చన్న అంచనాలు మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 
  • సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఐటీసీ షేర్లలో అమ్మకాల ఒత్తిడీ సూచీలను పడేశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం సూచీలకు మరో దెబ్బ. 
  • దేశీయంగా వెలువడుతున్న క్యూ4 ఫలితాలూ మదుపరులను పెద్దగా మెప్పించడం లేదు. మరోవైపు సమీప భవిష్యత్‌లో మార్కెట్‌ను అంచనా వేయడానికి కొలమానంగా భావించే వోలటాలిటీ ఇండెక్స్‌ ఇండియా (VIX) గురువారం మరింత పెరిగి 18 శాతానికి చేరింది. దీంతో మదుపరులు అమ్మకాలకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని