logo

ముదురుతున్న వివాదం!

ప్రభుత్వస్థలం కబ్జాకు గురవుతోంది. అక్రమమార్గంలో పట్టాలు చేసుకుంటున్నారు. విచారణ జరపండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అంటూ ఏకంగా శాసనసభ్యుడు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

Published : 28 Mar 2024 03:15 IST

భూ ఆక్రమణలపై రెవెన్యూ మంత్రికి ఎమ్మెల్యే ఫిర్యాదు
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

మార్ట్‌ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని మంత్రికి అందించిన వినతిపత్రం

ప్రభుత్వస్థలం కబ్జాకు గురవుతోంది. అక్రమమార్గంలో పట్టాలు చేసుకుంటున్నారు. విచారణ జరపండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అంటూ ఏకంగా శాసనసభ్యుడు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా.. క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు. అదే సమయంలో ఇవన్నీ నిరాధార ఆరోపణలేనా లేక నిజంగానే ఆక్రమణలు చోటుచేసుకున్నాయా, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు కావాలనే ఉపేక్షిస్తున్నారా, అసలు వాస్తవాలు ఏంటి.. ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఇప్పటికే నిర్మల్‌ ప్రాంతంలో నకిలీ డీ1 పట్టాలతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, చెరువు, శిఖం భూములు, దేవాదాయశాఖ స్థలాలు అధికారం అండతో కబ్జాకు గురవుతున్నాయని ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సోఫినగర్‌లో అలా..

పట్టణంలోని సోఫినగర్‌ ప్రాంతంలో ఇదివరకు పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న భూమిలో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 1975 వరకు ప్రభుత్వస్థలంగా ఉన్న ఆ ప్రాంతం ఆ తర్వాత ఇతరుల పేరుమీదకు ఎలా మారిందని ప్రశ్నిస్తున్నారు. గత పాలకుల ప్రమేయం వల్లనే ఈ తతంగం చోటుచేసుకుందని, ఈ కారణంగానే అధికారులు సైతం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఇదివరకే జిల్లా పాలనాధికారికి సూచించారు. గడువులోపు చర్యలు చేపట్టకపోతే నిరాహారదీక్ష చేపడుతానని హెచ్చరించారు. ఈలోపు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆందోళన విషయం సద్దుమణిగింది. కానీ, విచారణ చేపట్టారా, ఏ విషయాలు బయటపడ్డాయనే అంశంలో మాత్రం స్పష్టత కరవైంది. మరోపక్క.. అధికారులు లోతుగా విచారిస్తున్నారని, ఆక్రమణ విషయం రుజువైందని, పూర్తిస్థాయి స్పష్టత కోసం గడువు కోరుతున్నారంటూ స్థానిక భాజపా నాయకులు ప్రకటించారు. ఈ తరుణంలో ప్రభుత్వ భూమిలో తప్పుడు ధ్రువపత్రాలతో ఇలా ప్రైవేటు వ్యక్తులు మార్ట్‌ నిర్మించి, ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. తక్షణం స్పందించి ప్రారంభాన్ని అడ్డుకోవాలని, నిజనిజాల నిర్ధరణ కోసం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాలని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి దాదాపు మూడునెలలుగా ఓ విషయంపై ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందించడం ఇదివరకెన్నడూ లేదు. చేతిలో అధికారం ఉన్నా ఆక్రమణలు, ఆరోపణల విషయంలో తగిన స్పష్టత తీసుకొచ్చే విషయంలో తాత్సారం జరుగుతుండటం స్థానికులనూ కలవరానికి గురిచేస్తోంది.

గాజులపేట్‌లో ఇలా..

పట్టణంలోని గాజులపేట్‌ ప్రాంతంలో శ్రీకృష్ణ ఆలయ భూమి విషయంలోనూ ఇదేతరహా గందరగోళం నెలకొంది. దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయానికి పలు సర్వేనంబర్ల పరిధిలో సుమారు దాదాపు 9 ఎకరాల భూమి ఉందని, దీన్ని కొందరు అక్రమ విధానంలో దొంగ పట్టా చేయించుకున్నారని ఎమ్మెల్యే ఆరోపణ. విచారణలో భాగంగా నకిలీ పట్టా విషయం బయటపడిందని, స్థానిక రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేపడితే అన్ని విషయాలు బయటపడుతాయని, తగిన చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తూ రెవెన్యూశాఖ మంత్రికి విన్నవించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని