logo

నగేష్‌ నామినేషన్‌పై గందరగోళం

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్‌ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది.

Published : 27 Apr 2024 02:34 IST

అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్‌, బీఎస్పీ ఆరోపణ

ఈటీవీ - ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్‌ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. వివిధ రాజకీయ పక్షాల సమక్షంలో శుక్రవారం రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో) నామపత్రాల పరిశీలన జరిగింది. నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు వివిధ అంశాలతో దాఖలు చేసే అఫిడవిట్‌లో అన్ని ఖాళీలను పూరించాల్సి ఉంది. దేన్నీ ఖాళీగా వదలకూడదు. గోడం నగేష్‌ తరఫున దాఖలైన అఫిడవిట్‌లో మూడు చోట్ల ఖాళీలను పూరించకుండా వదిలేయటంపై బీఎస్పీ, కాంగ్రెస్‌, భారాస అభ్యంతరం వ్యక్తం చేయటం ఉత్కంఠకు దారి తీసింది. వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా నగేష్‌ నామపత్రాన్ని ఆమోదించటంతో ఆయా రాజకీయపక్షాల నుంచి నిరసన వ్యక్తమైంది. ఖాళీగా వదిలేసిన ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామపత్రాలను తిరస్కరించి భాజపా నామపత్రాన్ని  ఆమోదించడమేంటని వారు ప్రశ్నించారు.  

నిరాకరణపై నిరసన

రిటర్నింగ్‌ అధికారి తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి, బీఎస్పీ ఎంపీ అభ్యర్థి జంగు బాపు అభ్యంతరంతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు రాగా ఆర్‌వో రాజర్షిషా తీసుకోలేదు. ఇన్‌వార్డు సెక్షన్‌లో ఇవ్వాలని సూచించగా అక్కడా తీసుకోలేదు. దాంతో కాంగ్రెస్‌, బీఎస్పీ, భారాస నేతలు కలెక్టరేట్‌లోనే నిరసనకు దిగారు. ‘‘నిబంధనలను పారదర్శకంగా పాటించాల్సిన అధికారులు ఏకపక్షంగా వ్యవహరించటమే కాకుండా కేంద్రంలో భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆర్‌వో వ్యవహారశైలిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని’’ కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎస్టీ రిజర్వు కిందకు వచ్చే ఆదిలాబాద్‌ ఎంపీ స్థానంలో అధికారుల పాత్ర ఏకపక్షంగా కొనసాగుతోందని, అఫిడవిట్‌ను పూర్తిచేయని నగేష్‌ నామపత్రాన్ని రద్దు చేయాలని’’ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి జంగుబాపు డిమాండ్‌ చేశారు. అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తామని భారాస నేత జంగిలి ప్రశాంత్‌ పేర్కొన్నారు.

అఫిడవిట్‌లో ఖాళీగా వదిలిన గడి


అసలేం జరిగింది..

గోడం నగేష్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో లోక్‌సభ స్థానం ఆదిలాబాద్‌ అనే చోట (కోడ్‌ 01) రాయలేదు. అంటే దాన్ని శాసనసభ స్థానం అనుకోవచ్చా? లోక్‌సభ స్థానం అనుకోవచ్చా? అనేది కాంగ్రెస్‌, బీఎస్పీ, భారాస లేవనెత్తిన ప్రశ్న. ఏడో పేజీలోని ఆస్తుల వివరాలు వెల్లడించే కాలమ్‌ తొమ్మిదిలో చివరి ఖాళీని పూరించలేదు. స్థిరాస్తులను వెల్లడించే ఎనిమిదో పేజీలోని రెండో కాలమ్‌ పూరించలేదు. ఒకవేళ పొరపాటున అభ్యర్థులు పూరించకపోతే అధికారులే వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంది. వారి సమాచారానికి స్పందించని అభ్యర్థుల నామపత్రాలను తిరస్కరించే అవకాశం ఉంది. ఇవే నిబంధనలతో ఒకరిద్దరి నామపత్రాలను తిరస్కరించిన అధికారులు నగేష్‌ నామపత్రాన్ని ఆమోదించటం వివాదాస్పదమైంది. నగేష్‌కు సకాలంలో సమాచారం ఇవ్వనందున ఆర్‌వోకు ఉండే అధికారాలకు లోబడి ఆమోదించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కలెక్టరేట్‌లోనే ఉన్న ఆర్‌వో రాజర్షిషాను సంప్రదించటానికి మీడియా దాదాపుగా రెండు గంటల పాటు ప్రయత్నించినా స్పందించలేదు. తరువాత కాంగ్రెస్‌, బీఎస్పీ, భారాస శ్రేణులు మరోసారి కలెక్టరేట్‌కు రాగా అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఎన్నికల నిబంధనల పేరిట లోనికి అనుమతించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని