logo

నీళ్లు లేవు..నీడ లేదు..

జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి.

Published : 27 Apr 2024 02:31 IST

సంతల్లో చిరువ్యాపారులు.. కొనుగోలుదార్లకు తీవ్ర ఇక్కట్లు

న్యూస్‌టుడే, ఇచ్చోడ, బోథ్‌: జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. వారం రోజులకు సరిపడా అన్ని రకాల కూరగాయలు, వస్తువులను ఇక్కడ కొనుగోలు చేసి గ్రామస్థులు తీసుకెళ్తారు. ప్రస్తుతం ఎండలు ముదిరాయి. అక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కనీసం తాగునీరు, మూత్రశాలలు లేకపోవడం సమస్యలకు నిలయంగా మారింది. ఈ సంతల ద్వారా పంచాయతీలకు నిధులు వస్తున్నా  పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. జిల్లాలో దాదాపుగా 20కి పైగా సంతలు నిర్వహిస్తారు.  


మహారాష్ట్ర వాసులకు ఇదే దిక్కు

ఇది సొనాలలో నిర్వహించే వారసంత. ఇక్కడికి సొనాల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మహారాష్ట్రకు చెందిన అనేక గ్రామాల నుంచి ప్రజలు వారసంతకు తరలివస్తుంటారు. రూ.లక్షల్లో ఆదాయం పంచాయతీకి వస్తున్నా ఇప్పటి వరకు కనీసం తాగు నీటి సౌకర్యం కల్పించిన పరిస్థితి లేదు. మరోవైపు అత్యవసరమైన మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. తప్పని పరిస్థితుల్లో సంతకు వచ్చిన వ్యాపారులు, ప్రజలు స్థానికంగా ఉన్న ఇళ్ల నుంచి నీటిని పొందడంతో పాటు వారి మరుగుదొడ్లను వినియోగించుకుంటున్నారు.


కనీస సౌకర్యాలు కరవే  

ఇది సిరికొండ మండల కేంద్రంలోని వారసంత. ఇక్కడికి దాదాపుగా 30కి పైగా గ్రామాల ప్రజలు వస్తుంటారు. ఈ సంతతో పంచాయతీకి ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించలేదు. దూరప్రాంతల నుంచి వచ్చే వారు స్థానికంగా ఉన్న హోటళ్లలో నీటిని తాగాల్సిందే. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అత్యవసరంలో వారు పడే వేదన వర్ణనాతీతం. సంతకు వచ్చే మహిళా వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.


30 గ్రామాలకు ఆధారం

ఇది బోథ్‌ మండల కేంద్రంలోని వారసంత. 30 గ్రామాల ప్రజలు ఈ సంతకు వస్తుంటారు. సంత ద్వారా ఆదాయం పంచాయతీకి వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. సౌకర్యాలు కల్పించేలా చూడాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు. సంతల్లో సమస్యలు పరిష్కరించాలని ఇటీవల మండల కేంద్రానికి పలువురు సామాజిక కార్యకర్తలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని