logo

అడుగడుగునా కోడ్‌ గండం

గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి.

Published : 27 Apr 2024 01:59 IST

సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణకు ఆటంకం

సిరాల ప్రాజెక్టు వద్ద ప్రణాళికను పరిశీలిస్తున్న జిల్లా అదనపు పాలనాధికారి ఫైజాన్‌ అహ్మద్‌

భైంసా, న్యూస్‌టుడే: గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. దాని మరమ్మతులకు అయ్యే వ్యయం అంచనాలను సంబంధిత అధికారులు వెంటనే ప్రభుత్వానికి నివేదించగా అప్పట్లో శాసనసభ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఆర్థికశాఖ అనుమతులిస్తూ గత నెల 15న రూ.12.37 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసి, టెండరు పిలిచింది. మార్చి 22న టెండర్ల గడువు ముగియగా తెరిచేందుకు పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అడ్డుగా మారింది. మరో వైపు పార్లమెంటు ఎన్నికలు అయ్యాక స్థానిక సంస్థల ఎన్నిక¢లు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు అప్రమత్తం కాకుంటే  మరోసారి ఎన్నికల కోడ్‌ అడ్డు తగిలే ప్రమాదం పొంచి ఉంది. ఇలా వెంటాడుతున్న ఎన్నికల గండాలతో ఇప్పట్లో పనుల ప్రారంభంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

  • ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించేందుకు జిల్లా పాలనాధికారి అశిష్‌ సాంగ్వాన్‌ సూచనలతో అదనపు పాలనాధికారి ఫైజాన్‌ అహ్మద్‌ ఈ నెల 2న సిరాల ప్రాజెక్టును సందర్శించారు. తెగిన ప్రాజెక్టు తీరు, దాని నీటి సామర్థ్యం, ప్రభావంతో పడిపోయిన భూగర్భజలాలు, బీడుగా మారిన వ్యవసాయ భూములు, ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు. వెంటనే పనులు ప్రారంభించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోనున్నారని, అధికారులు, స్థానికులు అదనపు పాలనాధికారికి వివరించారు. పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. దీంతో జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ పనుల ప్రారంభానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. కాగా ఆ దస్త్రం అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ప్రాజెక్టు పునరుద్ధరణ అత్యవసరమే

పనులు చేపట్టేందుకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు కోసం కలెక్టరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ వెళ్లింది. ప్రాజెక్టు పునరుద్ధరణ అత్యవసరమే. వారం రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వెంటనే టెండర్లు తెరిచి పనుల ప్రారంభిస్తాం.

 ఫైజాన్‌ అహ్మద్‌, జిల్లా అదనపు పాలనాధికారి, నిర్మల్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని