logo

నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా

ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

Published : 20 Apr 2024 02:34 IST

విద్యుత్తు సంస్థ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విద్యుత్తు ఉపకేంద్రంలో శిక్షణ పొందుతున్న ఓఅండ్‌ఎం సిబ్బంది

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి వృత్తి నైపుణ్యంతోపాటు పనులు మెరుగ్గా చేసేందుకు శిక్షణ దోహదపడనుంది. ప్రాణ, ఆస్తి నష్టాల నుంచి గట్టెక్కించేలా సమాయత్తం చేస్తున్నారు. ఉమ్మడి అయిదు జిల్లాల నుంచి ఓఅండ్‌ఎం(ఆపరేషన్స్‌, మెయింటనెన్స్‌) సిబ్బంది నలుగురు చొప్పున, మరొకరిని నోడల్‌ అధికారిగా నియమించి గతనెలలో శిక్షణ ఇచ్చారు. దీన్ని జిల్లాస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా విద్యుత్తు సంస్థ అధికారి కార్యాచరణ చేపట్టారు. సిబ్బందిని బృందాలుగా విభజించి పదిరోజులపాటు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ చేయడం, ముందస్తుగా విద్యుత్తు తీగలు, నియంత్రికలు సరిచేయడం, విద్యుత్తు ప్రమాదాలు (మనుషులు, జంతువులు) పూర్తిగా నివారించడంపై అవగాహన కల్పిస్తున్నారు. సిబ్బంది భద్రతా ప్రమాణాలు పాటించడం, వందశాతం బిల్లులు చెల్లించేలా చొరవ తీసుకోవడం, వినియోగదారులకు విద్యుత్తు సమస్యలపై వేదికల ఏర్పాటు, సమస్యలపై స్పందిస్తూ సమయానికి పరిష్కరించేలా చర్యలు ఎలా చేపట్టాలో వివరిస్తున్నారు. వీటిపై అవగాహన కల్పించి సంస్థను అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.

జేఎల్‌ఎం నుంచి ఫోర్‌మెన్‌ వరకు..

ఒక్కో బృందానికి రెండ్రోజులపాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లాలో జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, లైన్‌ఇన్‌స్పెక్టర్‌, సీనియర్‌ లైన్‌ఇన్‌స్పెక్టర్‌, ఫోర్‌మెన్‌ ఇలా నాలుగు విభాగాల్లో సేవలందించే ఓఅండ్‌ఎం సిబ్బంది సుమారు 300 మంది పాల్గొననున్నారు. ఇందులో చాలామంది జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం స్థాయిలో నూతనంగా కొలువు సాధించిన వారు ఉన్నారు. వీరికి విధుల్లో చేరినప్పటి నుంచి సంస్థ పరంగా ఎలాంటి శిక్షణ లేకపోవడంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూర్చనుంది. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు శిబిరంలో తెలుసుకోవచ్చు. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. శిక్షణ అనంతరం సిబ్బంది ప్రతిభకు పదును పెట్టేందుకు ప్రత్యేక ప్రశ్నావళితో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

వ్యక్తిగత అప్రమత్తతపై అవగాహన

విద్యుత్తు సంస్థకు సంబంధించిన అంశాలతోపాటు వ్యక్తిగత అప్రమత్తతపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే ప్రథమ చికిత్స, సీపీఆర్‌ తదితర అంశాలపై నిపుణులచే సదస్సుల ఏర్పాటుతోపాటు వారితో సాధన చేయిస్తున్నారు. ఆయా బృంద సభ్యులను క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లడంతో పాటు విద్యుత్తు ఉపకేంద్రాల్లో ప్రత్యక్షంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

నాణ్యమైన, అంతరాయంలేని విద్యుత్తు అందించడమే లక్ష్యం

రాథోడ్‌ శేషారావు, విద్యుత్తు సంస్థ ఎస్‌ఈ, మంచిర్యాల జిల్లా

జిల్లాలోని విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ ప్రత్యేక ప్రణాళికలు, సీఎండీ సూచనలతో ముందుకెళ్తున్నాం. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా అందించడమే లక్ష్యంగా సిబ్బంది మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రత్యేక శిబిరాలు ఉపయోగపడనున్నాయి. విభజించిన బృందాలకు రెండ్రోజుల చొప్పున కేటాయించి నిపుణుల సమక్షంలో శిక్షణ అందిస్తున్నాం. దీంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని