logo

గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్‌ ఆఫర్‌’

అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్‌ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది.

Published : 26 Apr 2024 02:59 IST

బకాయిల చెల్లింపునకు కొత్త ఎత్తుగడ

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్‌ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. భూమి కొనుగోలు చేయగా.. వచ్చిన డబ్బులను డిపాజిట్దారులకు చెల్లించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కమీషన్లకు అలవాటుపడ్డ ఏజెంట్లకు తక్కువ ధరకే భూమిని విక్రయించాలని ముందుకొచ్చింది. నగరశివారులో ఎకరం స్థిరాస్తి వ్యాపారులకు ఇది వరకు రూ.1.10 కోట్లకు విక్రయించగా.. ఇప్పుడు ఆ ధరను రూ.80 లక్షలకు ఎకరం ఇస్తామంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భూమి ధరలు తగ్గుముఖం పట్టడంతో అక్కడ ఎకరం ధర రూ.50 లక్షలే ఉందని ఏజెంట్లు వాదిస్తున్నారు. ఈ ‘పంచాయితీ’లో ముందు వరుసలో ఉన్న సూత్రధారి తన కింద ఉన్న ముఖ్య ఏజెంట్లతో కలిసి కంపెనీ భూమిని కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నా.. కంపెనీ మరింత దిగి వస్తుందని వేచిచూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఫిక్స్‌డ్‌ డిఫాజిట్ల గడువు ముగిసిన వినియోగదారులు తమకు డబ్బులు ఎప్పుడు చేతికందుతాయా? అని ఎదురుచూస్తున్నారు. కంపెనీ లావాదేవీల ప్రారంభ సమయంలో జూనియర్‌ అసిస్టెంటుగా ఉన్న సూత్రధారి ఇప్పుడు జిల్లా అధికారిగా పదోన్నతి పొందగా.. అటు వృత్తిపరంగా ఇటు వ్యాపారంలోనూ రూ.కోట్లు గడించగా.. తన కింద పని చేసిన ఉపాధ్యాయులు దండిగానే వెనకేసుకున్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా అధికారి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కొందరి ఉపాధ్యాయుల నిర్వాకం అమాయకులను నిండా ముంచిన వైనం జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. పోలీసు ఫిర్యాదు చేస్తే వచ్చే డబ్బులు రావని ఏజెంట్లు డిపాజిట్దారులను బెదిరించడం కూడా వారి అమాయకత్వానికి అద్దం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని