logo

ఆదిలాబాద్‌ బరిలో 12 మంది అభ్యర్థులు

ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా..

Published : 30 Apr 2024 02:46 IST

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. సోమవారం స్వతంత్ర అభ్యర్థి రాఠోడ్‌ రాజు తన నామపత్రం ఉపసంహరించుకున్నారు. బరిలో 12 మంది అభ్యర్థులు మిగిలారు. రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషా, సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్‌ సమక్షంలో వీరికి గుర్తులను కేటాయించారు.

తొలి గుర్తు భారాస అభ్యర్థి సక్కుకు కేటాయింపు

భారాస అభ్యర్థి ఆత్రం సక్కుకు కారు గుర్తును తొలి నెంబరుగా పొందే అవకాశం దక్కింది. తెలుగు అక్షరమాలను అనుసరించి అభ్యర్థుల పేరును బట్టి గుర్తులు కేటాయించారు. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు హస్తం, భాజపా అభ్యర్థి గోడం నగేష్‌కు కమలం గుర్తును రెండు, మూడుస్థానాల్లో కేటాయించారు. వరుసగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థి మేస్రం జంగుబాపుకి ఏనుగు గుర్తు, గోండ్వానా దండకారణ్య పార్టీ అభ్యర్థి కొడప వామన్‌రావుకు తురా ఊదుతున్న మనిషి, ధర్మసమాజ్‌పార్టీ అభ్యర్థి గంగాదేవి మేస్రంకు చెప్పులు, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి గేడం సాగర్‌కు బాకా, అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చవాన్‌ సుదర్శన్‌కు రోడ్‌రోలర్‌, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి ఎన్‌.తిరుపతికి బ్యాట్, అలయన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థి మాలోతు శ్యాంలాల్‌నాయక్‌కు చపాతి రోలరు, స్వతంత్ర అభ్యర్థులు బుక్య జైవంత్‌రావుకు ప్రెషర్‌ కుక్కర్‌, రాఠోడ్‌ సుభాష్‌కు గ్యాస్‌ సిలిండర్‌ గుర్తులు దక్కాయి. ఇందులో తొలుత గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులకు, నమోదిత రాజకీయపార్టీల అభ్యర్థులకు, స్వతంత్ర అభ్యర్థులకు వరుస క్రమంలో ఎంపిక చేసుకున్న గుర్తులను కేటాయించారు. ఈవీఎంపైనా అభ్యర్థుల పక్కన కేటాయించిన గుర్తులు ఓటర్లకు కనిపించనున్నాయి.


పెద్దపల్లిలో 42 మంది పోటీ

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 42 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం నామపత్రాల ఉపసంహరణలో భాగంగా ఏడుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర, ఇతర పార్టీలకు చెందిన 63 మంది నామపత్రాలు దాఖలు చేశారు. అఫిడవిట్‌లో తప్పులు, సరైన ఆధార పత్రాలు సమర్పించకపోవడంతో 14 మంది నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 49 మందిలో ఏడుగురు ఉపసంహరించుకోగా 42 అభ్యర్థులు పోటీలో ఉన్నారని రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌ తెలిపారు. మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని