logo

ఎన్నికల ప్రక్రియ ముమ్మరం

జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

Published : 07 May 2024 03:41 IST

జిల్లాలో చురుగ్గా ఏర్పాట్లు  

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం గోదాములో ఈవీఎంలను పరిశీలిస్తున్న జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌, అధికారులు

నిర్మల్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఓటరు తుది జాబితా విడుదల చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమయ్యే ఈవీఎంల మొదటి, రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. పోలింగ్‌ అధికారులు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసిన అధికారులు ఈనెల 13న జరగనున్న పోలింగ్‌కు సమాయత్తమవుతున్నారు. ఓటు హక్కు ఉన్న వారందరికీ ఓటరు స్లిప్పుల పంపిణీ దాదాపు పూర్తిచేశారు.

సాంకేతిక నిపుణుల నియామకం

మే 13న జరిగే పోలింగ్‌కు అంతరాయం కలగకుండా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అదనపు ఈవీఎంలను కేటాయించారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున సాంకేతిక నిపుణులను నియమించారు. వీరు ఈవీఎంలలో సమస్యలు ఏర్పడితే వెంటనే సరిచేస్తారు. వినియోగానికి వీలుకాకపోతే అదనపు ఈవీఎంను అమర్చుతారు. ఈవీఎంలకు రెండు విడతల్లో యాదృచ్ఛికీకరణ (ర్యాండమైజేషన్‌) పూర్తిచేసి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.

కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తి

ఆదిలాబాద్‌ లోక్‌సభ బరిలో 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో నోటాతో కలిపి 13 పేర్లు ఉంటారు. ఈ జాబితా ఆధారంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతోపాటు వివిధ స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో ముద్రించిన బ్యాలెట్‌ పత్రాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించిన ఈవీఎంలలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల  ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 3, 4 తేదీల్లో కమిషనింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టారు.

పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు

జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 925 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి పోలింగ్‌ కేంద్రం ఆవరణలో టెంట్లు, తాగునీటి వసతి కల్పించనున్నారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ర్యాంపులు నిర్మించారు. వీల్‌ఛైర్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి నియోజకవర్గంలో నమూనా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. గతేడాది శాసనసభ ఎన్నికల తరహాలో ఈ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 8 ఆదర్శ, మరో అయిదు మహిళా, రెండు చొప్పున యూత్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని