logo

తప్పు వారిది.. శిక్ష వీరికి!

జాతీయ అర్హత పరీక్ష (నీట్) ప్రశ్నపత్రాల తారుమారు వ్యవహారంలో ఎన్టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) అధికారులు,  పాఠశాల ప్రిన్సిపల్‌ నిర్లక్ష్యం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.

Published : 07 May 2024 03:54 IST

నీట్‌ ర్యాంకుల విషయంలో గందరగోళం
భయపడొద్దంటున్న అధికారులు

ఆసిఫాబాద్‌ మోడల్‌ స్కూల్‌లో విచారణ చేపడుతున్న డీఆర్‌ఓ లోకేశ్‌రావు

ఈనాడు, ఆసిఫాబాద్‌: జాతీయ అర్హత పరీక్ష (నీట్) ప్రశ్నపత్రాల తారుమారు వ్యవహారంలో ఎన్టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) అధికారులు,  పాఠశాల ప్రిన్సిపల్‌ నిర్లక్ష్యం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇక్కడ పరీక్ష రాసిన విద్యార్థుల జవాబు పత్రాలను సైతం దిద్దుతామని, మార్కులు, ర్యాంకులు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నా.. ఏ విధంగా ర్యాంక్‌ ఇస్తారోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు సెట్ల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉండడంతో కీ పేపర్‌ విడుదలైతే తప్ప ఎన్ని మార్కులు వస్తాయో తెలియదని విద్యార్థులు చెబుతున్నారు. రెండు ప్రశ్నపత్రాలు కఠినంగా ఉన్నా, ఎవరి ప్రతిభ అనుసరించి వారికి మార్కులు వస్తాయని, ఒక్క మార్కుతో వేలల్లో ర్యాంకులు మారుతాయని వారంతా ఆందోళనకు గురవుతున్నారు.

ఎన్టీఏ అధికారులు జిల్లాలో ఉన్న అధికారులను ఎవరినీ సంప్రదించకుండా కనీసం, పరీక్షల నిర్వహణపై ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ప్రైవేటు పాఠశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇన్విజిలేటర్స్‌గా ప్రైవేటు ఉపాధ్యాయులే ఉన్నారు. ఎన్టీఏ అధికారులు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సైతం సదరు పాఠశాల సిబ్బంది హాజరుకాలేదు. తరచూ నిర్వహించే జూమ్‌ మీటింగుల్లో సైతం వీరు పాల్గొనలేదని సమాచారం. పరీక్షల నిర్వహణ తీరుపై అవగాహనలేకే విద్యార్థులను గందరగోళానికి గురిచేశారని వారి భవిష్యత్తును అగమ్యగోచరం చేశారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కఠినంగా..

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ‘జీఆర్‌ఐడీయూ’ కోడ్‌తో ఉన్న ప్రశ్నపత్రంలో పరీక్ష నిర్వహించగా.. ఆసిఫాబాద్‌లో ‘ఎన్‌ఏజీఎన్‌యూ’ కోడ్‌తో ఉన్న ప్రశ్నపత్రం ఇచ్చారు. పరీక్ష రాసిన చాలా మంది విద్యార్థులు మిగతా జిల్లాల పరీక్ష పత్రాల ప్రశ్నలతో పోల్చుతూ ఇవి కఠినంగా వచ్చాయని, రెండు, మూడు ప్రశ్నలు సిలబస్‌లో లేనివి ఇచ్చారని, ఈ ప్రభావం ర్యాంక్‌పై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్షలు వెచ్చించి కోచింగ్‌ తీసుకుని, పరీక్ష రాస్తే ఈ విధంగా చేశారని, న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెండేళ్ల నుంచి కష్టపడి చదువుతున్నా: పల్లెర్ల అమూల్య, ఆసిఫాబాద్‌  

రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుని చదువుతున్నా. నాన్న అప్పులు తెచ్చి కోచింగ్‌ ఇప్పించారు. నేను రాసిన పరీక్ష కఠినంగా ఉంది. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి.

నష్టపోకుండా చూడాలి: నయన్‌, ఆసిఫాబాద్‌  

నేను ఆసిఫాబాద్‌లో రాసిన నీట్ పరీక్ష చాలా కఠినంగా ఉంది. కొన్ని ప్రశ్నలు సిలబస్‌లో లేనివి వచ్చాయి. పరీక్ష నిర్వహణలో ఎక్కడ పొరపాటు జరిగిందో కాని ప్రతిభ గల విద్యార్థులు నష్టపోకుండా అధికారులు చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని