logo

మండుటెండల్లో.. పండుటాకుల గోస!

ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తోంది.

Published : 07 May 2024 03:57 IST

గ్రామాల్లో సంకేతాల్లేక.. పింఛన్ల కోసం కిలోమీటర్ల ప్రయాణం

దహెగాం మండలం గిరవెల్లికి జీపులో వెళ్తున్న రాంపూర్‌ పింఛనుదారులు

బెజ్జూరు, దహెగాం, న్యూస్‌టుడే: ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో సంకేతాలు రాక లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పటంలేదు. ప్రతి నెలా తీసుకునే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కిలోమీటర్ల దూరం ప్రయాణించి వ్యయప్రయాసలు పడి మండల కేంద్రాలకు వెళ్లక తప్పడం లేదు. అక్కడ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతోపాటు మండుటెండల్లో వెళ్లి రావడమంటే ప్రాణాలు పణంగా పెట్టినట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని సుమారు 35 గ్రామాలకు సంకేతాలు రావడంలేదు. దీంతో ఆయా గ్రామాల లబ్ధిదారులు పింఛను డబ్బులు తీసుకోవడానికి మండల కేంద్రాల్లో ఉన్న తపాలా కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. వెళ్లే సమయానికి కేంద్రాల్లో జనాలు ఎక్కువగా ఉంటే గంటల తరబడి నిరీక్షించాల్సిందే. కొందరు వృద్ధుల వేలిముద్రలు పడక వారు ఇక్కట్లకు గురవుతున్నారు. వేలిముద్రలు పడని వారికి సంబంధిత కార్యదర్శి వచ్చి వేలిముద్ర పెడితే గాని డబ్బులు ఇవ్వరాదు. కార్యదర్శి వచ్చే సరికి వారు ఎదురుచూడాల్సిందే. లేదంటే మరుసటి రోజు రావాల్సిందే. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించి గ్రామాల్లోనే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఈ గ్రామాల్లోనే సమస్యలు..

పెంచికల్‌పేట్ మండలంలోని కమ్మర్‌గాం, నందిగాం, జిల్లెడ, గుండెపల్లి, మొర్లిగూడ గ్రామాల్లో సంకేతాలు ఉండకపోవడంతో.. అక్కడి లబ్ధిదారులు దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెజ్జూరు తపాలా కార్యాలయానికి వచ్చి పింఛను డబ్బులు తీసుకుంటున్నారు. రానుపోనూ రూ.100లు ఆటో ఛార్జీలు భరిస్తున్నారు. దీంతోపాటు ఒక రోజంతా సమయం వృథా అవుతోంది. ఇలా ప్రతి నెలా కొనసాగుతోంది. మొర్లిగూడ, దిగెడ, రాంపూర్‌ గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు వేసినప్పటికీ అటవీశాఖ అడ్డుకోవడంతో.. పూర్తిస్థాయిలో పనులు కాలేదు. కమ్మర్‌గాంలో ఎయిర్‌టెల్‌ టవర్‌ పనులు పూర్తి చేసినప్పటికీ సంకేతాలు ఇవ్వలేదు.
తిర్యాణి మండలంలోని పంగిడిమాధారం, మంగి, రొంపల్లి, మానికపూర్‌, సంగాపూర్‌ గిరిజన గ్రామాల్లో సంకేతాలు లేవు. ఈ గ్రామాల వారంతా ఆటోల ద్వారా 8-10 కి.మీ. దూరంలోని తిర్యాణికి రావాల్సిన పరిస్థితి.
దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్‌, దిగిడ గ్రామాల లబ్ధిదారులు 15 కిలోమీటర్ల దూరంలోని గిరివెల్లికి వెళ్తారు.

పెంచికల్‌పేట్ మండలం జిల్లెడ, మొర్లిగూడ గ్రామాలకు చెందిన పింఛనుదారులు.. గ్రామాల్లో సంకేతాలు (సిగ్నల్స్‌) లేకపోవడంతో 22 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లేందుకు చెట్టు కింద వేచి ఉన్నారు. ఆటోకు రానుపోను రూ.150 లు ఛార్జీలు అవుతాయని, మండుటెండలో వెళ్లి వచ్చేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఛార్జీలు పెట్టుకుని పోతున్నాం: కనక రామయ్య, జిల్లెడ  

మా ఊళ్లో సరిగా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఉండవు. పింఛన్‌ కోసం 22 కిలోమీటర్ల దూరం ఆటోలు, జీపుల్లో పెంచికల్‌పేట్‌కు వెళ్లివస్తూ రూ.150 ఖర్చులు పెట్టుకుంటున్నాం. రోజంతా పోతోంది. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో వెళ్లాలంటే భయమేస్తోంది.

మా గ్రామాల్లోనే డబ్బులు చెల్లించాలి: మడే ముత్తుబాయి, జిల్లెడ  

మా గ్రామాల్లోని కొన్నిచోట్ల సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ వస్తాయి. అక్కడే పింఛన్లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. వృద్ధులంతా దూర ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎండలకు భయమేస్తోంది. మా ఊరికి బస్సులు రావు. జీపు, ఆటోలే దిక్కు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని