logo

సామాజిక సమీక‘రణం’

ఎన్నికల బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై గురిపెట్టారు. గతకొన్ని రోజుల వరుసగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి చేర్పించుకుంటున్నారు.

Published : 08 May 2024 03:34 IST

గంపగుత్త ఓట్లపై ప్రధాన పార్టీల దృష్టి

ఎన్నికల బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై గురిపెట్టారు. గతకొన్ని రోజుల వరుసగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి చేర్పించుకుంటున్నారు. వారి ఓట్లను గుంపగుత్తగా రాబట్టేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందుకోసం కీలక నేతలే రంగంలోకి దిగుతున్నారు.

మరో ప్రధాన పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ నేతలు దళిత సామాజికవర్గం ఓట్లను రాబట్టేందుకు రంగంలోకి దింపారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేయించి ఆ పార్టీకే మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్నకొద్దీ పెద్దపల్లి పార్లమెంటు బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఉదయం పల్లెలు, సాయంత్ర వేళ పట్టణాల్లో తిరుగుతూ విజయం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. విజయమే లక్ష్యంగా రాత్రివేళల్లో పార్టీ నేతలతో కలిసి సమాలోచనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా గంపగుత్తగా ఓట్లు పడే సామాజిక వర్గాలపై దృష్టి సారించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సామాజికవర్గాల్లో ఇన్నిరోజులు ప్రజాప్రతినిధులు, నాయకుల చేరికలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానపార్టీల అభ్యర్థులు ఇక ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. ఓట్లను రాబట్టేందుకు సన్నిహితులతో కలిసి వ్యూహాలు పన్నుతున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు సాధించి గుంపగుత్తగా ఓట్లు వచ్చేటట్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

సామాజికవర్గాల వారీగా లెక్కలు..

ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఉన్న నేతల ఆధ్వర్యంలో సామాజికవర్గాలవారీగా ఓట్ల లెక్కలు తీసుకున్నారు. ఆయా సామాజికవర్గాల ఓట్లను పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇందులో గుంపగుత్తగా పడే ఓట్లపై ఆరా తీస్తున్నారు. వారిఓట్లను రాబట్టే బాధ్యతలను మండలస్థాయిలో ద్వితీయశ్రేణి నాయకులకు అప్పగిస్తున్నారు. సామాజికవర్గాల్లోని నాయకుల ద్వారా కీలక వ్యక్తులను కలుస్తున్నారు. వారి డిమాండ్లను అంగీకరించడంతో పాటు తాత్కాలికంగా నజరానాలు అందజేస్తున్నారు. అన్నీ కుదిరిన తర్వాతే పార్టీల్లో చేరికలు, బహిరంగ ప్రకటనలు తమకు మద్దతుగా ఇప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది..

ఆ మూడింటిపైనే..

జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న మూడు సామాజికవర్గాలపైనే ప్రధాన పార్టీ నేతలు దృష్టిసారించారు. వారి ఓట్లను రాబట్టేందుకు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సామాజికవర్గం ఓటర్లను మచ్చిక చేసుకోవడంతోపాటు ప్రత్యర్థుల సామాజికవర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. వారి ఓట్లను రాబట్టేందుకు దేనికీ వెనకాడటం లేదు. అన్నీ చూసుకుంటామనే వారికి భరోసా కల్పిస్తున్నారు. ఆయాసామాజిక వర్గాలనుంచి అత్యధిక ఓట్లను పొందేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు అటువైపు ఉన్నవారు కాస్త ఇటువైపు చేరుతున్నారు. ఆ సామాజికవర్గాల్లో కీలకంగా ఉండే నాయకులకు ఎరవేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు