logo

రహదారులకు ప్రాధాన్యం.. ఆరోగ్య భాగ్యం

‘‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రజాసంక్షేమం కోసం పని చేయాలనేది నా ఆశయం. ప్రగతి నా లక్ష్యం. వివాదాలు, విభేదాలు నా విధానం కాదు. ఈ అంశాలే నన్ను ఎంపీగా గెలిపిస్తాయనే నమ్మకం నాకు ఉంది.’’

Published : 08 May 2024 03:47 IST

భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌

‘‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రజాసంక్షేమం కోసం పని చేయాలనేది నా ఆశయం. ప్రగతి నా లక్ష్యం. వివాదాలు, విభేదాలు నా విధానం కాదు. ఈ అంశాలే నన్ను ఎంపీగా గెలిపిస్తాయనే నమ్మకం నాకు ఉంది.’’ అన్నారు భాజపా అభ్యర్థి గోడం నగేష్‌. ఎంపీగా విజయం సాధించాక వచ్చే అయిదేళ్లలో ఏం చేస్తారనే దానిపై ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.  

ఈటీవీ - ఆదిలాబాద్‌

ఈనాడు : ఆదిలాబాద్‌ ఎంపీగా విజయం సాధిస్తే మీరు ముందుగా ప్రాధాన్యం ఇచ్చే ప్రధాన అంశాలేవి?

నగేష్‌ : ఎంపీగా విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా రహదారుల నిర్మాణంతోపాటు ప్రజల ఆరోగ్యానికి ఊతమిచ్చే అంశాల ఆధారంగా పని చేస్తా. ప్రధానంగా 44వ నెంబరు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ఆసిఫాబాద్‌ వరకు మరో జాతీయ రహదారి, జైనథ్‌ మండలం భోరజ్‌ నుంచి ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం జందాపూర్‌ మీదుగా మహారాష్ట్రలోని మహోర్‌ వరకు మరో జాతీయ రహదారిని ఏర్పాటు చేయిస్తా. వీటితోపాటు మారుమూల గ్రామాలకు, నివాసిత ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించటానికి ప్రాధాన్యం ఇస్తా. ప్రజల ఆరోగ్యానికి భరోసానిచ్చేలా వైద్య సేవలు మెరుగుపడేలా కృషి చేస్తా. జనాభా ప్రాతిపదికన చూస్తే కాగజ్‌నగర్‌లో ఇప్పుడున్న నవోదయ పాఠశాలనే కాకుండా మరొకటి తీసుకొస్తా. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయిస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక జటిల సమస్యగా మారిన గల్ఫ్‌, బీడీ కార్మికులకు ప్రభుత్వపరంగా లబ్ధి చేకూర్చే ప్రణాళికతో ముందుకెళ్తా.

ఈ : సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న మీరు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు. మళ్లీ ఎంపీగా గెలిపిస్తే ఇప్పుడేం అభివృద్ధి చేస్తారనే విమర్శ కాంగ్రెస్‌, భారాస నుంచి వస్తోంది. ఏమంటారు?

నగేష్‌ : నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకంలాంటిది. ఉమ్మడి జిల్లాకు నేను ఏం చేశానో? ఏం చేయలేదో? ప్రజలకు తెలుసు. రహదారులు, రైల్వేలైన్‌, వైద్య సదుపాయాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి వసతుల కల్పన, ఐటీడీఏ బలోపేతం ఇవన్నీ నా హయాంలోనే జరిగాయి. నా సిఫారసులతోనే పేదలకు మేలు జరిగింది. నేనంటే గిట్టని పార్టీలు, నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఈ : ఆదిలాబాద్‌ సిమెంటు పరిశ్రమ(సీసీఐ)ని తెరిపించడంలో ఇచ్చిన హామీని భాజపా నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపిస్తే పరిశ్రమని తెరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మీరేమంటారు?

నగేష్‌ : సిమెంటు పరిశ్రమ మూతపడేలా చేసిందే కాంగ్రెస్‌. సరళీకృత విధానాలకు లోబడి పరిశ్రమకు ఆర్థిక మద్దతును నిలిపివేసిందే కాంగ్రెస్‌. ఇవాళ రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందేందుకు ఏవేవో మాటలు చెబుతుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నన్ను ఎంపీగా గెలిపిస్తే సీసీఐ పునః ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయా? లేవా? ముడి సరకు ఉంటేనే సరిపోదు. ఆధునిక యంత్రపరికరాలు ఉన్నాయా? లేవా? సాధ్యాసాధ్యాలేమిటనే దానిపై ప్రత్యేక కమిటీని నియమిస్తాం. దాని ఆధారంగా ముందుకు వెళ్తాం తప్ప లేనిపోని హామీలిచ్చి మోసం చేయను.

ఈ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలు మీకు తెలియనివి కావు. మీరు ఎంపీగా విజయం సాధిస్తే సమస్యకు పరిష్కార మార్గమేంటి?

నగేష్‌ : ఈ సమస్య తీవ్రత ఏమిటో నాకు తెలుసు. అనవసరమైన విమర్శలకు తావీయను. సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉంటుంది. అన్ని వర్గాల సమ్మతితో సాధ్యమైనంత వరకు ఏ అవరోధం లేకుండా సమస్య పరిష్కారమయ్యేలా నా పరిధిలో నేను కృషి చేస్తా. అర్హులైన వారెవరికీ అన్యాయం జరగకుండా చూస్తా. అందరి సమ్మతితో న్యాయం జరిగేలా చేస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని