logo

అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం

రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు.

Published : 25 Apr 2024 02:34 IST

పాడేరులో నాయకులతో మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాజపా కార్యాలయంలో తెదేపా సీనియర్‌ నాయకులు కె.సుబ్బారావు తదితరులను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం జి.మాడుగుల మండల కేంద్రంలో నాయకులతో భేటీ అయ్యారు. అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు. కూటమి నాయకులంతా ఏకమై పాడేరు నియోజకవర్గంలో తనను, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం పాత పాడేరు శివాలయాన్ని సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడి తనను గెలిపించాలని కోరారు. భాజపా జిల్లా నాయకులు పరశురామరాజు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు, నాయకులు పి.రవికుమార్‌, తెదేపా నాయకులు కె.సుబ్బారావు, పిన్నయ్యదొర తదితరులు పాల్గొన్నారు.

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ అసెంబ్లీ, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు పాంగి రాజారావు, కొత్తపల్లి గీతల విజయానికి తెదేపా శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర పిలుపునిచ్చారు. అరకులోయ మండలం పద్మాపురంలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో తెదేపా నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. దొన్నుదొర మాట్లాడుతూ.. పాంగి రాజారావు విజయానికి శ్రేణులు పనిచేయాలన్నారు. తెదేపా అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకోవాలని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకు సీటును భాజపాకు ఇవ్వాల్సి వచ్చిందని అధినేత తనకు వివరించారన్నారు. తెదేపా-భాజపా-జనసేన కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు సాధ్యమని చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పడిందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలంటే అరకులో కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నాయకులు పెట్టెలి దాసుబాబు, శెట్టి బాబూరావు, నీరజ, నిర్మల, బూర్జ లక్ష్మి, భాజపా నాయకులు రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు సంక్షేమ పథకాలు

అరకులోయ, న్యూస్‌టుడే: తెదేపా- భాజపా- జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. అరకులోయలో బుధవారం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు మేలు జరగాలంటే కూటమి గెలుపు అనివార్యమన్నారు. వైకాపా హయాంలో నిబంధనల పేరుతో సంక్షేమ పథకాల్లో కోత విధించారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. తెదేపా, జనసేన నాయకులు వంతల నాగేశ్వరరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు