logo

జగన్మాయతో జలగండం!

ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్‌ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు.

Updated : 25 Apr 2024 04:46 IST

గ్రీజు పూయడానికీ సొమ్ములివ్వని సర్కారు
ప్రమాదం అంచున ప్రధాన రిజర్వాయర్లు

ఈనాడు, పాడేరు రంపచోడవరం, చింతపల్లి, దేవరాపల్లి, మాడుగుల, నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్‌ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. విపత్తులెన్నో తట్టుకున్న జలాశయాలకు జగనే పెద్ద గండంగా మారారు. ఏటా బడ్జెట్‌లో కాగితాలపై రూ. కోట్లు మంజూరు చూపించి కనీసం గేట్లకు గ్రీజు పూయడానికి కూడా సొమ్ములివ్వలేదు. పైగా ఆ జలాశయాల నెత్తినే పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను తెచ్చిపెడుతున్నారు. దీంతో ప్రధాన రిజర్వాయర్లన్నీ ప్రమాదం అంచుకు చేరుకున్నాయి. అన్నదాతలకు సాగునీటి భరోసా ఇవ్వలేకపోతున్నాయి.

రైవాడ ఆధునికీకరణకు బైబై

2022-23 బడ్జెట్‌లో కేటాయింపు: రూ. 2.26 కోట్లు
2023-24లో కేటాయింపు: సున్నా

రైవాడ ప్రాజెక్టుకు గతేడాది రూ. 2.26 కోట్లు కేటాయించినా కేవలం రూ.8.86 లక్షలు మాత్రమే ఖర్చుచేయగలిగారు. దేవరాపల్లి మండలంలోని ఈ ప్రాజెక్ట్‌ కాలువల ఆధునికీకరణకు ఇదివరకే జైకా నుంచి రూ. 36 కోట్లు మంజూరు చేశారు. వాటితో పది శాతం పనులు కూడా పూర్తిచేయకుండానే వదిలేశారు. ఈ జలాశయం నుంచి 67 వేల క్యూసెక్కుల నీరు విడిచిపెట్టేలా నిర్మించిన గేట్లు నిర్వహణ గాడితప్పింది. ఏడాదిన్నర క్రితం గేట్ల పైభాగంలోని రెండు కౌంటర్‌ వెయిట్లు కిందకు జారిపడ్డాయి. నిధుల సమస్యతో వాటిని బాగుచేయకుండా వదిలేశారు. ఎన్నికల వేళ ఇబ్బందులు తలెత్తుతాయని ఈ మధ్యనే వాటికి మరమ్మతులు చేసి అమర్చారు. ఈ జలాశయం ఎగువనే అదాని సంస్థకు రెండు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు (పీఎస్‌పీ) కట్టబెట్టారు. వీటివల్ల రైవాడలోకి ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశం తక్కువ. ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించలేకపోతున్నారు. ఇక పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటైతే రైవాడ కింద సాగు సున్నాయే..

పొలాలకు చేరని జలాలు

చింతపల్లి మండలం తాజంగి జలాశయం కింద సుమారు 1500 ఎకరాల ఆయకట్టు ఉంది. జలాశయంలో ఎప్పుడూ నీరు నిండుకుండలా ఉంటుంది. కానీ సరైన నిర్వహణ లేకపోవడంతో రైతుల పొలాలకు నీరు చేరడం లేదు. తాజంగి మీదుగా వంతమామిడి వరకు ఒకటి, బలభద్రం నుంచి రాచపనుకు వరకు మరొక కాలువ ఉన్నాయి. కాలక్రమంలో ఈ కాలువలు పూడుకుచేరాయి. వీటిని బాగు చేయించడం లేదు. అసలే మరమ్మతులకు నోచుకోని జలాశయానికి ఏటా వర్షాకాలంలో గండ్లు పడుతుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.

తాండవ రైతుకు హైడ్రో షాక్‌

2022-23లో బడ్జెట్‌ కేటాయింపు: రూ.88.93 లక్షలు  
2023-24 కేటాయింపు: రూ. 2.54 కోట్లు

  • నాతవరం మండలంలోని తాండవ జలాశయానికి రెండేళ్ల క్రితం రూ. 18.99 కోట్లు కావాలని ప్రతిపాదించారు. కాని గతేడాది రూ. 88.93 లక్షలే కేటాయించారు. ఈ ఏడాది ప్రాజెక్టు నిర్వహణకు రూ. 2.54 కోట్లు కేటాయించారు. ఆయకట్టు స్థిరీకరణకు ఇచ్చే నిధుల్లో కోతపెట్టారు. అంతటితో జగన్‌ సర్కారు ఆగలేదు. ఈ ప్రాజెక్టు ఎగువన క్యాచ్‌మెంట్‌ ఏరియాలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు కట్టబెట్టారు. దీనివల్ల తాండవలోకి వచ్చే నీరు తగ్గిపోనుంది. ఈ ఏడాదే ఆయకట్టులో సాగునీరందక 10 వేల ఎకరాల్లో నాట్లు పడలేదు. ఖరీఫ్‌ చివర్లో వారబందీ అమలు చేయాల్సి వచ్చింది. అయినా జగన్‌Ú తన సన్నిహితునికి పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టును అప్పగించి తాండవ రిజర్వాయర్‌ను ప్రమాదంలోకి నెట్టారు.

కోనాంకు కోత..

2022-23 బడ్జెట్‌
కేటాయింపు: రూ.40.10 లక్షలు
2023-24లో కేటాయింపు: రూ. 5.38 లక్షలు

కోనాం ప్రాజెక్టుకు గతేడాది కేటాయించిన బడ్జెట్‌లో రూ. 34 లక్షల మేర ఈ ఏడాది తగ్గించారు. నిధులు కోతపెట్టడంతో ప్రాజెక్ట్‌, కాలువల నిర్వహణ ఆశించిన మేర పనులు జరిగే అవకాశం లేదు. ఆయకట్టులో శివారు భూములకు నీరందడం గగనమై పోతోంది. స్పిల్‌వే గేటు వంగిపోయింది. నీటి లీకేజిలను అరికట్టేందుకు రబ్బర్‌ షీల్డ్‌లు మార్చాల్సి ఉన్నా నిధుల సమస్య కారణంగా వాటిని బాగు చేయలేకపోతున్నారు. విద్యుత్తు సదుపాయం లేదు. జనరేటర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది.

పెద్దేరుపై ఎన్నికల ప్రేమ

మాడుగుల మండలం జాలంపల్లి శివారు రావిపాలెం వద్ద 2006లో జగన్‌ తండ్రి, దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పెద్దేరు ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టుకు ఈ ఏడాది బËడ్జెట్‌లో పైసా నిధులు కేటాయించలేదు. ఈ జలాశయం కాలువలన్నీ పూడికతో నిండిపోయాయి. నాలుగు గేట్లు లీకయి సాగునీరంతా వృథాగా పోతుంది. అయిదేళ్లలో ఈ ప్రాజెక్టు వంకే చూడలేదు. ఎన్నికల వేళ స్థానిక మంత్రికి పెద్దేరుపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. హడావిడిగా రూ. 84 కోట్లు మంజూరు చేసినట్లు జీఓ తెచ్చారు. బడ్జెట్‌లో మాత్రం సొమ్ములు కేటాయించలేదు. అయినా ఎన్నికల్లో రైతులను మభ్యపెట్టేందుకు ఇటీవల కాలువల ఆధునికీకరణకు శిలాఫలకం వేసేశారు. జలాశయం నాలుగు గేట్లలో ఒక గేటు లీకేజీ ఉంది. అది మూయలేదు. త్రీఫేజ్‌ కరెంటు లేక సిబ్బందే ఏటా తమ జేబుల నుంచి డీజిల్‌ పోయించుకుని జనరేటరు నడుపుతూ కాలువ నీరు విడుదల చేస్తారు.

ముసురుకొన్న సమస్యలు

రంపచోడవరం మన్యంలోని ముసురుమిల్లి జలాశయం పనులు ఏళ్లు గడుస్తున్నా నేటికి పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, మండలాలతోపాటు మైదాన ప్రాంతాలైన గోకవరం, కోరుకొండ మండలాల్లో 29 గ్రామాల్లో 22,300 ఎకరాలకు సాగునీరు అందుతోంది. 1.6 టీఎంసీల నీటి సామర్థ్యంతో కూడిన ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి పంట కాలువ పనులు పూర్తయినా హెడ్‌వర్క్స్‌ పనులు పూర్తి కాలేదు. దీంతో వర్షం వస్తే తప్ప కెనాల్‌కు నీరందించలేని పరిస్థితులు దాపురించాయి. దీంతో ఐదు మండలాల్లో రబీ సీజన్‌లో నీరు అందడం లేదు.

తారకరామా.. దుస్థితి కనుమా

సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరందించే మాడుగుల మండలంలోని తారకరామా జలాశయం నిర్వహణ కుంటుపడింది. గేట్లు ఆపరేట్‌ చేసే భాగం పూర్తిగా తుప్పుపట్టింది. ప్రధానంగా మట్టిగట్టు దెబ్బతింది. గతంలో కొట్టిన గండిని పూడ్చలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని