logo

Vallabhaneni Vamsi: వంశీ చెబితే.. కేసు కడతారంతే!

గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలకు అడ్డూఆపూ లేకుండా పోతోంది. ప్రతిపక్షంపై దాడులకు తెగబడడం.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడం గన్నవరం వైకాపా నేతలు, పోలీసులకు వెన్నతోపెట్టిన విద్యగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 26 Aug 2023 10:05 IST

తెదేపా నేతలపై దాడులు.. తిరిగి వారిపైనే కేసులు
ప్రతిపక్ష పార్టీ కీలక నేతలందరినీ వేధించడమే లక్ష్యం

గురువారం వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు అనుచరులతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే వంశీ

ఈనాడు, అమరావతి- హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలకు అడ్డూఆపూ లేకుండా పోతోంది. ప్రతిపక్షంపై దాడులకు తెగబడడం.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడం గన్నవరం వైకాపా నేతలు, పోలీసులకు వెన్నతోపెట్టిన విద్యగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనే దాడులకు తెగబడి, కార్లను సైతం పెట్రోలుపోసి తగలబెట్టేసి.. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టి.. ఇప్పటికీ వేధిస్తున్నారు. తాజాగా తెదేపా యువనేత లోకేశ్‌ యువగళం పాదయాత్రలో భాగంగా.. రంగన్నగూడెంలో గురువారం జరిగిన ఫ్లెక్సీ వివాదంలోనూ యథావిధిగా ప్రతిపక్ష నాయకులపైనే కేసులు నమోదు చేశారు. వీటి వెనుక.. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉండడంతో పోలీసులు ఏకపక్షంగా ముందుకెళ్లి తెదేపా నాయకులపైనే కేసులు పెట్టి.. భయాందోళనలకు గురిచేస్తున్నారు.

అలా రభస.. ఇలా ఫిర్యాదు...

రంగన్నగూడేనికి లోకేశ్‌ వస్తున్నారని తెలిసి.. ఆయన ఫొటోతో అవమానించేలా బ్యానర్‌ను తయారుచేసి.. తెదేపా శ్రేణులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ బ్యానర్‌ను.. యువగళం పాదయాత్ర మార్గంలో కనిపించేలా ఏర్పాటు చేశారు. గొడవ చేయాలనే ఎమ్మెల్యే వంశీ అనుచరులు సిద్ధమై వచ్చారనడానికి ఈ బ్యానరే ప్రత్యక్ష నిదర్శనం. గొడవ చేసి తెదేపా నేతలపై కేసులు పెట్టాలనే పన్నాగంతోనే వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. గొడవ జరిగిన వెంటనే ఎమ్మెల్యే వంశీ, ఆయన అనుచరులు ముందే సిద్ధంగా ఉన్నట్టుగా వీరవల్లి పోలీస్‌స్టేషనుకు చేరుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెదేపా ప్రధాన నాయకులతో పాటు గన్నవరంలోని కీలకమైన 47మంది ప్రతిపక్ష నేతల జాబితా ముందే సిద్ధంగా ఉంచామన్నట్టు తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చి మూడు ఫిర్యాదులు చేశారు. ఆ వెంటనే పోలీసులు కూడా వారందరిపైనా కేసులు పెట్టేయడం చకచకా జరిగిపోయాయి.

అజ్ఞాతంలో తెదేపా నాయకులు..!

గన్నవరం నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు పలువురు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రంగన్నగూడెంలో గొడవకు సంబంధించి వీరవల్లి పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో, అరెస్టులు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో కీలక నాయకులు, కార్యకర్తలు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరిపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు.

  • కసుకుర్తి చైతన్యధర్మేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు యార్లగడ్డ వెంకట్రావుతో పాటు మొవ్వా వేణుగోపాల్‌, మొవ్వా శ్రీనివాసరావు, వెనిగళ్ల జ్ఞానశేఖర్‌, కనకవల్లి శేషగిరిరావు, కనకవల్లి చినయాకోబు, కొలుసు రంగారావు, మండపాటి రాంబాబు, ఆళ్ల గోపాలకృష్ణలపై 447, 427, 323, 506, 290 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
  • తలారి వినయరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యార్లగడ్డ వెంకట్రావు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, మొవ్వా వేణుగోపాల్‌, పరసా కిరణ్‌, బెజవాడ కృష్ణ, పలగాని వీరాంజనేయులు, పలగాని శ్రీనివాసరావు, కసుకుర్తి వేణుబాబు, యడవల్లి స్వామి, కొనకళ్ల నరేంద్ర, చలమాల చిన్ని, జాస్తి వెంకటేశ్వరరావు, కంభంపాటి సాయి, తగరం కిరణ్‌బాబు, కలపాల వంశీ, గోగినేని అవినాష్‌, రావి వెంకటేశ్వరరావు, కాసర్నేని రాజా, జాస్తి శేషులపై 323, 506 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.
  • తలారి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యార్లగడ్డ వెంకట్రావు, మొవ్వా వేణుగోపాలరావు, మొవ్వా శ్రీనివాసరావు, వెనిగండ్ల జ్ఞానశేఖర్‌, కనకవల్లి శేషగిరి, కనకవల్లి చినయాకోబు, కొలుసు రంగారావు, మండపాటి రాంబాబు, కొండపల్లి వెంకన్న, ఆర్నేపల్లి సూరిబాబు, అవిర్నేని భవానీశంకర్‌, వేములపల్లి శ్రీనివాసరావు, దయాల రాజేశ్వరరావు, రాచప్రోలు అశోక్‌, చిలకంటి రమేష్‌, షేక్‌ జాన్‌బాషాలపై 307, 324 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆరు నెలలుగా.. తెదేపా లక్ష్యంగా..

గన్నవరం నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా తెదేపా శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీని వెనక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ఈఏడాది ఫిబ్రవరిలో గన్నవరంలో తెదేపా కార్యాలయంపై దాడి చేసిన ఎమ్మెల్యే వర్గీయులు, తెదేపా నాయకుల్ని, కార్యకర్తల్ని కొట్టారు. పైగా వీరిపైనే కేసులు పెట్టారు. సాక్షాత్తూ స్థానిక సీఐతోనే ఫిర్యాదు చేయించి కీలక వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ని, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని అరెస్టు చేసేందుకు పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఈ సంఘటనలో కూడా తెదేపా వర్గీయులు పలు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ పోలీసులు వాటిని తేలిగ్గా తీసుకుని వైకాపా వారికి 41 సీఆర్పీసీ నోటీసులిచ్చి సరిపెట్టేశారు.

విమర్శలు వచ్చినా అదే తీరు...

గన్నవరం నియోజకవర్గంలో పోలీసుల తీరుపై గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా అధికార పార్టీ నాయకులు చెప్పిందే చేస్తూ... ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. గన్నవరం తెదేపా కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు, లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. రంగన్నగూడెంలో వైకాపా వర్గీయులు రెచ్చగొట్టే రీతిలో ఫ్లెక్సీ వేస్తున్న సంగతి ముందే తెలిసినా, సరిగా స్పందించకపోవడం, కనీసం పాదయాత్ర గ్రామానికి చేరుకున్న సమయంలోనైనా ఫ్లెక్సీ వద్దే వైకాపా నాయకులు గుమిగూడినా వారిని వారించకపోవడమే ఇంత వివాదానికి కారణమైంది. పైగా ఆ సమయంలో అక్కడ లేని తెదేపా నాయకుల పేర్లు సైతం కేసుల్లో చేర్చడం అధికార పార్టీ నాయకులకు పోలీసులు ఎలా కొమ్ముకాస్తున్నారో స్పష్టం చేస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో భారీస్థాయిలో జూదం, కోడిపందేలు, గంజాయి రవాణా, సివిల్‌ తగాదాల్లో జోక్యం లాంటివి అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నా.. పోలీసులు కనీసం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని