logo

పశ్చిమ బరిలో సుజనా

తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.

Published : 28 Mar 2024 06:06 IST

భాజపా అభ్యర్థిగా రంగంలోకి కేంద్ర మాజీ మంత్రి
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - వీరులపాడు

తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దిగనున్నారు. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన ఆశించింది. ఆ పార్టీకి కేటాయిస్తే పోతిన మహేష్‌ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అనూహ్యంగా.. ఇది భాజపాకు వెళ్లడంతో ఆయన కాస్త నిరాశకు గురయ్యారు. ఈ సీటు దక్కించుకునేందుకు చివరి వరకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. భాజపా పోటీ చేస్తుందా? జనసేనకు దక్కుతుందా? అని చర్చనీయాంశంగా మారింది. చివరకు.. బుధవారం రాత్రి భాజపా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో.. అందులో సుజనాకు దక్కడంతో ఎదురుచూపులకు తెరపడింది.

ఇంతింతై...

ఏపీ భాజపాలో కీలక నేతగా ఎదిగిన సుజనా చౌదరి.. విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. పొత్తులో విజయవాడ లోక్‌సభ స్థానం భాజపాకు కేటాయిస్తే.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఈ స్థానం తెదేపాకు వెళ్లడంతో అసెంబ్లీ సీటుపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. భాజపాకు కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో విజయవాడ పశ్చిమ సీటు ఆ పార్టీకి దక్కింది. పశ్చిమ నుంచి పోటీ చేస్తారని ఇటీవల ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీనికి పలువురు పోటీ పడ్డా.. చివరకు అధిష్ఠానం సుజనా పేరునే ఖరారు చేసింది. తెదేపాతో రాజకీయ అరంగ్రేటం చేసిన వైఎస్‌ చౌదరి.. 2010లో చంద్రబాబు రాజ్యసభకు నామినేట్‌ చేశారు. అప్పటి నుంచి నిర్విరామంగా రెండు దఫాలు 12 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ఆంతరంగికుల్లో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 2014లో తెదేపా ఎన్డీఏ కూటమిలో చేరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించడంతో సుజనా చౌదరి కేంద్ర కేబినెట్‌లో చేరారు. 2018 వరకు దాదాపు నాలుగేళ్లపాటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రం నుంచి తెదేపా వైదొలగే వరకు మంత్రిగా పనిచేశారు.

పొన్నవరంపై మమకారం

సుజనా పూర్వీకులది కృష్ణా జిల్లా పామర్రు మండలం పెదమద్దాలి. అంతా గతంలోనే ఇక్కడి నుంచి వలస వెళ్లారు. అమ్మమ్మ గ్రామమైన ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో జన్మించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీ నిధులు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామం మొత్తం భూగర్భ మురుగునీటి కాలవ వ్యవస్థను అభివృద్ధి చేశారు. గ్రామ చెరువు సుందరీకరణ, చుట్టూ నడక బాట, కంచికచర్ల అడ్డరోడ్డు నుంచి రెండు వరసల బీటీ రోడ్డు నిర్మించారు. ఊళ్లో నిరంతరం ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి చికిత్స చేయిస్తున్నారు. కృష్ణా నది నుంచి గ్రామానికి తాగునీటి సరఫరా కోసం చర్యలు తీసుకున్నారు. నందిగామలో గత ఏడాది నుంచి సుజనా ఫౌండేషన్‌ ద్వారా మహిళలు, యువతకు స్వయం ఉపాధి రంగంలో శిక్షణ ఇస్తున్నారు.

సానుకూలతలు పుష్కలం

విజయవాడ పశ్చిమ పరిచయం లేని స్థానం అయినా.. తెదేపాతో సుదీర్ఘ అనుబంధం ఉండడం సుజనాకు ఆ పార్టీ క్యాడర్‌ నుంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు. పొత్తులో తెదేపా, జనసేన ఓట్లు బదిలీ అవుతాయనే ఆశాభావంలో భాజపా ఉంది. ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందనీ, దానికే తొలి నుంచి సుజనా మద్దతుగా పలు దఫాలు మాట్లాడారు. ఇది కూడా ఆయనకు కలిసొస్తుందన్న అభిప్రాయం ఉంది.


విజయవాడ పశ్చిమ

  • యలమంచిలి సత్యనారాయణ చౌదరి (వైఎస్‌ చౌదరి) (63)
  • ఎంటెక్‌, మిషన్‌ టూల్స్‌ ఇంజినీరింగ్‌
  • భార్య: పద్మజ. కుమారుడు: కార్తీక్‌, కుమార్తె: నాగచాందిని
  • ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తండ్రి, తల్లి పేరుతో సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పేరుతో పరిశ్రమ స్థాపించారు. మూడు దశాబ్దాల్లో ఉక్కు, విద్యుత్తు, టెలికాం, పట్టణ మౌలిక వసతులు, తదితర రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. 2005లో ఎన్టీఆర్‌ ట్రస్టు సలహాదారునిగా చేరారు. ఆ సమయంలో ట్రస్టు కార్యకలాపాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తూ తెదేపా అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. తర్వాత 2010లో తెదేపాలో చేరగా రాజ్యసభ సభ్యుడిగా ఆ పార్టీ ఎంపిక చేసింది. అప్పటి నుంచి 2022 వరకు 12 ఏళ్లపాటు ఎంపీగా పనిచేశారు. 2014-18 కాలంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో తాను పుట్టిన పొన్నవరం గ్రామాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని