logo

వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు

అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు.

Published : 29 Mar 2024 04:10 IST

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
తోట్లవల్లూరు, న్యూస్‌టుడే

రొయ్యూరు క్వారీలో తవ్వకాలు చేస్తున్న ప్రాంతం

నుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. పట్టా భూముల్లో అర్ధరాత్రుళ్లు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్నారని రైతులు చేస్తున్న ఫిర్యాదులు బుట్ట దాఖలవుతున్నాయి. వైకాపా నాయకుల కను సైగలతో అధికార యంత్రాంగం ఇసుక వ్యాపారులకు అండగా నిలుస్తోంది. రొయ్యూరు క్వారీలో గురువారు తెల్లవారు జామున జిల్లా మంత్రి అనుచరులు ఇసుక తవ్వకాలు చేస్తుంటే గ్రామస్థులు కొంతమంది అడ్డుపడ్డారు. వారిని లెక్క చేయకుండా యథేచ్ఛగా ఇసుక లోడింగ్‌ చేసుకొని తరలించేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రొయ్యూరు గ్రామంలోనే కొందిమందికి డబ్బులిచ్చి జిల్లా మంత్రి అనుచరులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరులు సైతం రాత్రుళ్లు విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ, పోలీస్‌, ఎస్‌ఈబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం స్పదించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పొట్లపాలెం చెరువులో

మచిలీపట్నం రూరల్‌, న్యూస్‌టుడే: పొట్లపాలెంలో రాత్రి సమయాల్లో అక్రమ చెరువు తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పంట పొలాల మధ్య తవ్వకాలతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రమేయంతో ఇది జరుగుతుండడంతో నోరు మెదపడానికి భయపడుతున్నారు. వందల కొద్ది ట్రాక్టర్ల మట్టిని గ్రామంలోనే ఇతర ప్రాంతంలో మెరక పనులకు ఉపయోగిస్తున్నారు. పొట్లపాలెం-కొత్తపూడి మధ్య సాగుతున్న అక్రమ తవ్వకాలతో వరిసాగుకు ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బుసక దిబ్బలను యంత్రాలు పెట్టి తవ్వేశారు. దీనిపై గ్రామస్థులు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం పొలాల్లో వ్యవసాయ పనులు అయిపోవడంతో అక్రమార్కులు మళ్లీ రెచ్చిపోతున్నారు. బుసక తవ్వేసి ట్రాక్టర్‌ రూ.1200 నుంచి రూ.1500లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో ఉండటంతో తమను పట్టించుకునే వారు ఉండరని అక్రమార్కులు భావిస్తున్నారు. అక్రమ తవ్వకాల విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని