logo

పోస్టల్‌ బ్యాలట్‌లో గందరగోళం

జిల్లాల విభజనతో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌లో గందరగోళం నెలకొంది. పోలింగ్‌ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అవస్థలు పడ్డారు.

Published : 08 May 2024 05:04 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: జిల్లాల విభజనతో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌లో గందరగోళం నెలకొంది. పోలింగ్‌ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అవస్థలు పడ్డారు. మంగళవారం జరిగిన పోస్టల్‌ బ్యాలట్‌లో 2397 మంది పాల్గొనాల్సి ఉండగా.. ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాలైన పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాల, తహసీల్దారు కార్యాలయాలకు చేరుకొన్న సిబ్బంది తీరా ఓటు హక్కు వినియోగించుకొనే సమయానికి బ్యాలట్‌ పత్రాలు, ఓటరు జాబితాలు అందుబాటులో లేకపోవడంతో అవాక్కయ్యారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సిన కొందరు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన  వెయ్యి బ్యాలట్‌ పత్రాలు ఎన్టీఆర్‌ జిల్లాకు పంపగా 600 మాత్రమే అక్కడ వినియోగమవగా మిగిలిన 400 బ్యాలట్‌ పత్రాలు పెనమలూరు నియోజకవర్గానికి చేరుకోకపోవడంతో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే వరకు ఈ అంశం అధికారుల దృష్టిలో లేకపోవడంతో సమస్య తలెత్తింది. పలువురు ఓటర్లు రిటర్నింగ్‌ అధికారి రాజు, తహసీల్దారు పీఎన్డీ ప్రసాద్‌లకు ఫిర్యాదులు చేసి నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రానికి కొందరు ఓటర్లకు బ్యాలట్‌ పత్రాలను సర్దినా మరికొందరికి ఏర్పాటు చేయలేకపోయారు. బుధవారం ఉదయం మిగిలిన వారికి కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్వో రాజు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలట్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదని,  సంతకాలకు బాల్‌పాయింట్‌ పెన్ను ఏర్పాటు చేయాల్సి ఉండగా జెల్‌ ఇంకు పెన్నులు ఏర్పాటు చేయడంపై పలువురు ఓటర్లు అభ్యంతరాలు తెలిపారు. అధికారులు వెంటనే బాల్‌పాయింట్‌ పెన్నులు అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 2397 ఓట్లకు 2242 (93.5 శాతం) పోలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు