logo

నగరానికి మరో పురస్కారం

స్వచ్ఛతలో జాతీయస్థాయిలో మెరిసిన విజయవాడ నగరానికి మరో పురస్కారం దక్కింది. స్మార్ట్‌సిటీ మిషన్‌, హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ, ఐటిడిపి ఇండియా భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా

Published : 19 Jan 2022 03:31 IST

విజయవాడ సత్యనారాయణపురం ఎన్‌ఆర్‌పీ రోడ్డులో అభివృద్ధి చేసిన కాలిబాట

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: స్వచ్ఛతలో జాతీయస్థాయిలో మెరిసిన విజయవాడ నగరానికి మరో పురస్కారం దక్కింది. స్మార్ట్‌సిటీ మిషన్‌, హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ, ఐటిడిపి ఇండియా భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ‘స్ట్రీట్‌ ఫర్‌ పీపుల్స్‌ ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని అమలు చేశారు. దీనిలో భాగంగా ఎంపిక చేసిన రహదార్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాలు అవార్డు కోసం పోటీపడ్డాయి. మొత్తం 11 నగరాలకు తుదిజాబితాలో చోటు దక్కగా, నాన్‌ స్మార్ట్‌ సిటీస్‌ విభాగంలో విజయవాడ రెండో స్థానంలో నిలిచింది. ఈ పురస్కారం కింద నగరానికి రూ.50 లక్షల పారితోషికం దక్కనుందని నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు.

2 కిలోమీటర్ల మేర అభివృద్ధి..
వీధి వ్యాపారాలను అనువుగా, రాకపోకలకు ఇబ్బంది లేకుండా, సందర్శకులకు ఆహ్లాదంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకంలో భాగంగా సత్యనారాయణపురం ఎన్‌ఆర్‌పి రోడ్డును పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. దాదాపు రూ.4 లక్షల అంచనా వ్యయంతో సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చేశారు. రహదారి వెంట ఉన్న తోపుడు బండ్లను సమీపంలోనే అనువైన ప్రాంతానికి సర్దుబాటు చేసి, వెండర్ల జీవనోపాధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇరువైపులా ఆక్రమణలను తొలగించి అక్కడ రంగులతో తీర్చిదిద్దారు. పాత టైర్లను సేకరించి చక్కటి రంగులు దిద్ది, చిన్నారులకు, పెద్దలు కూర్చునేలా చేశారు. సందర్శకులు, పాదచారులు విశ్రాంతి తీసుకునేలా, ఆహ్లాదాన్ని అందుకునేలా స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్నారులు అడుకునేందుకు పలు రకాల ఆటపరికరాలును అమర్చారు. దీనికే పురస్కారం దక్కింది. నగరంలో పలు రహదారులను ఇలా అభివృద్ధి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. పోలీసులు, ఆర్టీసీ అధికారుల నుంచి మరింత సహకారం కోసం నగరపాలక సంస్థ ఎదురుచూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని