logo

హనుమా.. భక్తుల అవస్థలు కానవా?

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసే రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ వేశాయి.

Published : 26 May 2024 03:23 IST

రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ

 పగిలిన వసతి గదుల కిటికీల అద్దాల్లో ఒకటి

గుంతకల్లు, న్యూస్‌టుడే : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసే రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ 16 ఏసీ గదులున్నాయి. 8 గదుల్లో ఏసీలు గత కొన్ని నెలలుగా పనిచేయడంలేదు. ఫలితంగా ఇందులో బస చేసే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కిటికీల అద్దాలు పగులడంతో వాటి గుండా కోతులు గదుల్లోకి ప్రవేశించి వస్తువులను పాడు చేస్తున్నాయి. కిటికీలకు మరమ్మతులు చేయించాలని భక్తులు పలుమార్లు ఆలయ అధికారులను విన్నవించినా స్పందన కొరవడింది. వేసవి కాలం కావడంతో భక్తులు ఏసీ గదులనే ఎంపిక చేసుకుంటున్నారు. భగభగమండే ఎండల నేపథ్యంలో ఏసీ గదుల్లో సేద తీరుదామని భక్తులు అధికంగా బాడుగ చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఏసీ పని చేయకపోవడంతో భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. తాము బాడుగ చెల్లిస్తున్నా ఏసీలు లేకుంటే తాము గదుల్లో ఏవిధంగా విశ్రాంతి తీసుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. గదుల ఏసీలు పనిచేయకుంటే అత్యవసర పనుల కింద వాటికి మరమ్మతులు చేయించాల్సి ఉన్నా ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక వసతి గదుల సముదాయానికి సంబంధించి గోడలు రంగులు పాలిపోవడంతో కళావిహీనంగా కనిసిస్తున్నాయి. వెంటనే అధికారులు గదుల విషయంలో అవసరమైన మరమ్మతులతో పాటు గదులకు రంగులు వేయించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లగా కోతులు విద్యుత్తు తీగలను నాశనం చేస్తున్న కారణంగా ఏసీలు పనిచేయడం లేదన్నారు. మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పగిలిన కిటికీల అద్దాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయిస్తామని వివరించారు.

ఏసీలు పనిచేయని వసతిగదుల సముదాయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని