logo

భూమి రాసివ్వకపోతే చంపేస్తా.. మంత్రి ఉషశ్రీచరణ్‌ అనుచరుడి వీరంగం

‘భూమి రిజిస్ట్రేషన్‌ చేయిస్తారా లేదా? చేయకపోతే చంపుతాం. ఇదే లాస్ట్‌ వార్నింగ్‌. రిజిస్ట్రేషన్‌ చేయించకుంటే ఇక చెప్పేది ఏం లేదు. చేసి చూపిస్తాం. ఏ పక్క నుంచి వచ్చి చంపుతామో తెలీదు. మీ తమ్ముడు ఆ రోజు నా కారును క్రాస్‌ చేసుకుంటూ వెళ్లాడు.

Updated : 18 Oct 2023 09:35 IST

ప్రాణభయంతో బంధువుల వద్ద తలదాచుకున్న బాధితులు
జడ్పీటీసీ సభ్యుడి బెదిరింపుల వీడియో వైరల్‌

బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్న జడ్పీటీసీ సభ్యుడు మంజునాథ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘భూమి రిజిస్ట్రేషన్‌ చేయిస్తారా లేదా? చేయకపోతే చంపుతాం. ఇదే లాస్ట్‌ వార్నింగ్‌. రిజిస్ట్రేషన్‌ చేయించకుంటే ఇక చెప్పేది ఏం లేదు. చేసి చూపిస్తాం. ఏ పక్క నుంచి వచ్చి చంపుతామో తెలీదు. మీ తమ్ముడు ఆ రోజు నా కారును క్రాస్‌ చేసుకుంటూ వెళ్లాడు. ఆ రోజే కారుతో ఢీకొట్టి చంపేసేవాణ్ని. రేపు వస్తాం. రిజిస్ట్రేషన్‌ చేయించకుంటే తర్వాత చూస్తాం..’ అంటూ అనంతపురం జిల్లా శెట్టూరు మండలం వైకాపా జడ్పీటీసీ సభ్యుడు మంజునాథ్‌ రెచ్చిపోయారు. భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ బాధితులను భయాందోళనకు గురిచేశారు. మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రధాన అనుచరుడైన మంజునాథ్‌ బాధితులను బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధితుల కథనం ప్రకారం.. శెట్టూరు మండలం అయ్యగారిపల్లికి చెందిన సుధాకర్‌ కుటుంబానికి 100 ఎకరాల భూమి ఉంది. ఈ నెల 6న సుధాకర్‌ను కొట్టి 21 ఎకరాలను జడ్పీటీసీ సభ్యుడు మంజునాథ్‌ బలవంతంగా కళ్యాణదుర్గంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడు సుధాకర్‌.. డీఎస్పీ, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌లకు స్పందనలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రాణ భయంతో అనంతపురంలోని బంధువుల ఇంటికి వచ్చి తలదాచుకున్నారు. అయినా మంజునాథ్‌ అక్కడికి కూడా తన అనుచరులతో వచ్చి మిగిలిన భూమిని కూడా రాసివ్వాలంటూ బెదిరింపులకు దిగినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 15 రోజులుగా తమ కుటుంబాన్ని వెంటాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోతున్నారు. జడ్పీటీసీ సభ్యుడు మంజునాథ్‌, అతని అనుచరులు శేఖర్‌, పూజారప్ప, వీరేశ్‌, రాయదుర్గం రంగడు ఇంటికి వచ్చి చంపుతామని బెదిరిస్తున్నారని సుధాకర్‌ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇంట్లోని పిల్లలను కూడా చంపుతామంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రాణభయంతో ఒక్కొక్కరు ఒక్కో ఊరిలో తలదాచుకున్నామని చెబుతున్నారు. తమ ఆధీనంలో ఉన్న భూమికి పట్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నా..రాసిచ్చేయండని బెదిరిస్తున్నారని సుధాకర్‌ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని