logo

Anantapuram: కారులో వచ్చారు.. చీరలతో ఉడాయించారు

నార్పల మండల పరిధిలోని కేశేపల్లి గ్రామంలో అయిదుగురు మహిళలు, ఓ పురుషుడు ఇన్నోవా కారులో వచ్చి రూ.1.50 లక్షల విలువైన చీరలతో ఉడాయించిన ఉదంతమిది

Updated : 01 Dec 2023 08:49 IST

నార్పలలో ఘటన

  చోరీకి ముందు వేరే దుకాణంలోకి వెళ్తున్న మహిళలు(సీసీ కెమెరాలో నమోదైన దృశ్యం)

నార్పల, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని కేశేపల్లి గ్రామంలో అయిదుగురు మహిళలు, ఓ పురుషుడు ఇన్నోవా కారులో వచ్చి రూ.1.50 లక్షల విలువైన చీరలతో ఉడాయించిన ఉదంతమిది. గ్రామంలో కేశవ, జానకి దంపతులు నాలుగేళ్లుగా ప్రధాన రహదారి పక్కనే ఉన్న తమ ఇంట్లో చీరల వ్యాపారం చేస్తున్నారు. వీరి వద్దకు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇన్నోవాలో అయిదుగురు మహిళలు, ఒక పురుషుడు వచ్చారు. తిరుపతిలో వివాహం ఉందని, విలువైన పట్టు చీరలు కావాలని అడిగారు. ఆ ప్రకారం జానకీ విలువైన పట్టుచీరలు చూపించారు. సదరు మహిళలు రూ.1.50 లక్షలు విలువ చేసే 12 చీరలను ఎంపిక చేసుకున్నారు. మంచినీరు కావాలని అడగడంతో దుకాణ యజమాని ఇంట్లోకి వెళ్లగానే సదరు మహిళలు చీరలతో కారులో ఉడాయించారు. బాధితురాలు కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఇన్నోవా కారుకు నెంబరు ప్లేటు కూడా లేదని గ్రామస్థులు తెలిపారు. బాధితులు నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి ముందు సదరు మహిళలు, పురుషుడు వేరే దుకాణానికి వెళ్లారు. అక్కడ సీసీ కెమెరాలు ఉండటంతో వెనక్కి వచ్చారు. ఆ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని