logo

Anantapur: ఏడేళ్లకు లేకలేక పుట్టిన బిడ్డ.. నిమ్మకాయ మింగి దుర్మరణం

ఆ దంపతులకు ఏడేళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ పుట్టడంతో సంబరపడ్డారు. చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. బుడిబుడి అడుగులు వేస్తే చూసి మురిసిపోయేవారు. వారి ఆనందాన్ని చూసిన విధికి కన్ను కుట్టింది.

Updated : 11 Jan 2024 08:49 IST

కుమార్తె మృతదేహంపై రోదిస్తున్న తండ్రి గోవిందరాజులు

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: ఆ దంపతులకు ఏడేళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ పుట్టడంతో సంబరపడ్డారు. చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. బుడిబుడి అడుగులు వేస్తే చూసి మురిసిపోయేవారు. వారి ఆనందాన్ని చూసిన విధికి కన్ను కుట్టింది. నిమ్మకాయ రూపంలో చిన్నారిని బలిగొంది. ఆ ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాలంటీరు సకీదీప, గోవిందరాజులు దంపతుల కుమార్తె జశ్విత(9నెలలు) ఆడుకుంటూ ఇంటి వరండాలో పడిన నిమ్మకాయను తీసుకుని నోట్లో పెట్టుకుంది. తల్లి గమనించి దాన్ని తీసేందుకు ప్రయత్నించగా గొంతులోకి వెళ్లిపోయింది. చికిత్స కోసం పెద్దవడుగూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో మెరుగైన వైద్యం కోసం పామిడికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుమార్తె మృతితో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగారు. చిన్నారి మృతదేహంపై పడి బోరున విలపించారు. ఏడేళ్ల తర్వాత పుట్టిన బిడ్డను తమకు లేకుండా చేశావా దేవుడా అంటూ గుండెలు పగిలేలా రోధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని