logo

వైకాపా వ్యతిరేక ఓటును ఆపేందుకు ప్రయత్నం

ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఓటు వినియోగించుకోవాలో.. స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Published : 06 May 2024 06:42 IST

అంగన్‌వాడీ, ఆశా, ఇతర ఉద్యోగులకు తాయిలాలు
పోస్టల్‌ బ్యాలెట్‌లో బేరసారాలు

పుట్టపర్తి, న్యూస్‌టుడే : ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఓటు వినియోగించుకోవాలో.. స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటును నిలుపుదల చేయడానికి ఇలాంటి గందరగోళ పరిస్థితులను గురి చేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే 16 వేల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారు. వీటితో పాటు అత్యవసర సేవలు అందించే 33 శాఖల అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొందరు ఓట్లు కొనుగోలుపై దృష్టి సారించారు. ఓటు వేస్తారనే నమ్మకం ఉన్న ఉద్యోగులు, సిబ్బందికి రూ.3 నుంచి రూ.5 వేలు అందజేస్తున్నారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, అత్యవసర సేవల సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి ఓటు వేయాలని, నగదు అందజేసి వస్తున్నారు. నియోజకవర్గం కేంద్రానికి తీసుకు రావడానికి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. స్వయంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికార పార్టీ నాయకులు తిష్ఠ వేసి, పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు పర్యటనకు 8వ తేదీ వస్తున్న నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లా నుంచి అత్యధికంగా మంది సోమవారం నుంచి బందోబస్తుకు వెళ్తున్నారు. ప్రధానమంత్రి పర్యటనకు వెళ్తున్నామని, ఓటు వేయడానికి సమయం లేదని, ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని, గడువు పొడిగించాలని పోలీసులు కోరుతున్నారు.

ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఓటు వేసేలా చర్యలు

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7 ఓపీఓలకు, అత్యవసర సర్వీసులకు 8 తేదీల్లో అవకాశాన్ని ఇస్తున్నట్లు కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్‌, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు తీసుకెళ్లి, ఓటు పొందవచ్చుని వివరించారు. జిల్లాలో అత్యవసర సేవలకు సంబంధించి, 1301 మంది పోలీసు సిబ్బందికి ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని