logo

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను

‘రానున్న కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కూటమి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయి.

Updated : 08 May 2024 07:26 IST

అన్నదాతకు ఏటా రూ.20 వేలు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు  ఉచిత ప్రయాణం
‘ఈనాడు’తో తెదేపా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బీకే పార్థసారథి

ఈనాడు డిజిటల్‌, పుట్టపర్తి: ‘రానున్న కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కూటమి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆర్థికంగా ఎదుగుదలకు దోహదం చేయనున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాకు పెద్దమొత్తంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు పెద్దమొత్తంలో నిధులు తీసుకొచ్చి మౌలిక వసతుల్ని మెరుగుపరుస్తాం’ అని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి స్పష్టం చేశారు.

ధరలు నియంత్రిస్తాం

తెదేపా హయాంలో ఏరోజు విద్యుత్తు ఛార్జీలు పెంచలేదు. జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. పరిపాలన చేతకాకపోవడం వల్లే ధరలు పెరిగిపోయాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా రంగం కుదేలైంది. రానున్న కూటమి ప్రభుత్వం ధరల్ని నియంత్రిస్తుంది. ఇప్పటికే ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం

ఏప్రిల్‌ నుంచే పింఛను

పింఛనుదారులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఇంటింటికీ వచ్చి  పింఛను అందిస్తాం. ఏప్రిల్‌ నుంచే ఇస్తాం. సామాజిక భద్రతలో భాగంగానే రూ.4 వేలకు పెంచాం. దివ్యాంగులకు రూ.6 వేలు అందించి ఆదుకుంటాం. పేదలకు పట్టణాల్లో 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తాం.

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం

బీసీల కోసం రూ.1.50 లక్షల కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయిస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను అందిస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం.

ప్రతి మహిళకు నెలకు రూ.1,500

మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యం కల్పించాం. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వబోతున్నాం. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వారికి ఈ సాయం అందనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించి చిరు వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తాం. కలలకు రెక్కలు పథకం ద్వారా విద్యార్థినుల చదువులకు అవసరమయ్యే రుణ సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే వడ్డీ చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.

యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు

అధికారం చేపట్టిన వంద రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు మొదలుపెడతాం. ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల కొలువులు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్ట్‌అప్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుని రాయితీలు అందిస్తాం. జిల్లాను ఆటోమొబైల్‌ హబ్‌గా మారుస్తాం.

మైనారిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు

ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తాం. రానున్న కూటమి ప్రభుత్వంలో రూ.100 కోట్లతో మైనారిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తాం. అర్హత కలిగిన ఇమామ్‌కు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు ప్రతినెలా ఇస్తాం. క్రైస్తవులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాం.

90 శాతం రాయితీతో డ్రిప్‌ పరికరాలు

తెదేపా హయాంలో రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్‌ పరికరాలు అందించాం. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేశారు. కూటమి ప్రభుత్వం రాగానే రాయితీని పునరుద్ధరిస్తాం. ప్రస్తుతం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అంటూ రైతుల భూముల్ని లాక్కునే కుట్ర చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం. రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి పాసుపుస్తకానికి కేంద్రం సాయం రూ.6 వేలతో కలిపి రూ.26 వేలు ఇస్తాం.

మడకశిరకు నీరు అందిస్తాం

పెనుకొండ నుంచి హంద్రీనీవా ద్వారా మడకశిరకు బైపాస్‌ కెనాల్‌ ద్వారా నేరుగా నీరందించేలా చర్యలు తీసుకుంటాం. వక్కకు మార్కెట్‌ సదుపాయం కల్పిస్తాం.

పరిశ్రమలు తీసుకొస్తాం...

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాం. కేంద్రం సహకారంతో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు