logo

ఓటర్ల ఓపికకు పరీక్ష

సగటున ఒక నిమిషంలోపే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది.

Published : 18 May 2024 04:22 IST

జిల్లా సచివాలయం : సగటున ఒక నిమిషంలోపే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగు కేంద్రాల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్‌) జరిగినా ఓటర్ల కేటాయింపు అస్తవ్యస్తం, గందరగోళంగా సాగింది. 1500పైన ఓటర్లు కల్గిన బూత్‌లను రెండుగా విభజించారు. ఇదే క్రమంలో ఒకే ఆవాస ప్రాంతంలో ఎక్కువ, తక్కువ ఓటర్లు ఉంటే... రెండు బూత్‌లకు సర్దుబాటు చేసినట్లు వెల్లడించారు. అనంత అర్బన్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, శింగనమల, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1955 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒకో బూత్‌లో సగటున 200పైగా... గరిష్ఠంగా 1500 దాకా ఓటర్లు ఉన్నారు. 21 బూత్‌లకు ‘ఎ’ను సృష్టించి అదనంగా ఏర్పాటు చేశారు. ఎక్కువ ఓటర్లు కల్గిన బూత్‌లను రెండుగా విభజించారు. దీంతో అర్ధరాత్రి దాటినా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ జరిగింది. మరుసటి రోజు ఈవీఎంలను అప్పగించాల్సి వచ్చింది.

11 గంటలు.. 660 ఓట్లు

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఒకరు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఓటు వేసేందుకుగాను కనీసం 27 నుంచి 30 సెకన్లు సమయం పడుతుందని అంచనా వేశారు. ఈలెక్కన గంటకు 120 మంది ప్రకారం ఓటు వేసినా... మొత్తం 11 గంటల్లో 1320 మంది ఓటు వేయవచ్చని భావించారు. ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు వేయడానికి కనీసం నిమిషానికిపైగా పట్టింది. ఈ లెక్కన 11 గంటల్లో  660 మందే ఓటు వేయడానికి వీలుంటుంది. గొడవలు, ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే అదనంగా సమయం పడుతుంది. ఒక్కో బూత్‌లో వెయ్యికిపైగా ఓట్లు కల్గిన ప్రాంతాల్లో నిర్దేశిత సమయం చాలలేదు. జిల్లాలో 1200 మందికిపైగా ఓటర్లు ఉన్న బూత్‌లు 273 ఉన్నాయి. వెయ్యికిపైగా లెక్కిస్తే సగానికి సగం ఉన్నాయి. దీంతో అర్ధరాత్రి దాటినా పోలింగ్‌ జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని