logo

పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి?

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ చిత్తూరులో నూతన కోర్టు భవన సముదాయ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు.

Published : 27 Mar 2023 03:25 IST

జస్టిస్‌ మానవేంద్రనాథరాయ్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు లీగల్‌: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ చిత్తూరులో నూతన కోర్టు భవన సముదాయ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. కోర్టు భవన నిర్మాణాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఆయనకు వివరించారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారని ఆయన అడగ్గా.. ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ దేవానందం సమాధానమిచ్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఆర్‌అండ్‌బీ డీఈఈ దస్తగిరి, సైట్‌ ఇంజినీరు విఘ్నేష్‌ పాల్గొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ను సత్కరిస్తున్న న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు

న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలపై వినతి

న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌కు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపీనాథరెడ్డి విన్నవించారు. ఆయన్ను.. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.  సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారు ఆయన్ను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు రవీంద్రారెడ్డి, లక్ష్మీపతి, మునీర్‌బాషా, బాలసుందరం, ఉద్యోగులు పాల్గొన్నారు.

చిత్తూరులో నూతన కోర్టు భవనాల సముదాయాన్ని త్వరలో ప్రారంభించేందుకు ప్రత్యేక చొరవ చూపి సహకరిస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ పేర్కొన్నారు.  జిల్లా కోర్టు సముదాయంలోని బార్‌ అసోసియేషన్‌ భవనంలో న్యాయవాదులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన చిత్తూరు బార్‌ అసోసియేషన్‌కు రావడం సంతోషకరమని,  ఇక్కడ న్యాయవాద వృత్తిని ప్రారంభించినవారు ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. బెంచ్‌కు.. బార్‌కు మంచి అనుబంధం ఉంటే చక్కటి తీర్పులు వస్తాయన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ పోక్సో కోర్టును ఎస్టేట్‌లోని కొత్త కోర్టు ప్రాంగణానికి మార్పుచేయాలని కోరగా  తనవంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన్ను సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్‌, న్యాయమూర్తులు, రాష్ట్ర న్యాయవాదుల క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ద్వారకనాథరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ఆనంద్‌ యాదవ్‌, జిల్లాకోర్టు పీపీ రవీంద్రనాథరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని