logo

మీటర్లు లేక.. దోపిడీ పక్కా!

తెలంగాణకు చెందిన ప్రవీణ్‌ కుటుంబం విధుల నిమిత్తం తిరుపతికి వచ్చి స్థానికంగా నివాసం  ఉంటోంది. ఇటీవల భార్యతో కలసి సొంతూరుకు వెళ్లి తిరిగి రైల్లో తిరుపతికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆటోలో నారాయణపురం వెళ్లేందుకు స్టేషన్‌ బయట ఉన్న ఆటోలను ఆశ్రయిస్తే రూ.250 ఛార్జీగా చెప్పి..

Updated : 04 Sep 2023 05:35 IST

ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆటోవాలాలు

న్యూస్‌టుడే, తిరుపతి(నేరవిభాగం)

తెలంగాణకు చెందిన ప్రవీణ్‌ కుటుంబం విధుల నిమిత్తం తిరుపతికి వచ్చి స్థానికంగా నివాసం  ఉంటోంది. ఇటీవల భార్యతో కలసి సొంతూరుకు వెళ్లి తిరిగి రైల్లో తిరుపతికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆటోలో నారాయణపురం వెళ్లేందుకు స్టేషన్‌ బయట ఉన్న ఆటోలను ఆశ్రయిస్తే రూ.250 ఛార్జీగా చెప్పి.. రూ.200 ఇస్తే వస్తామన్నారు. అతన్ని కాదని స్టాండ్లో ఉన్నవారెవరూ రాలేని పరిస్థితి ఉండటంతో చేసేది లేక  అడిగినంత ఇచ్చి ప్రయాణించారు.

తిరుపతి శివజ్యోతినగర్‌కు చెందిన కల్యాణి, ఆమె అత్త, ఇద్దరు చిన్న పిల్లలతో కలసి సొంతూరైన నాయుడుపేటకు వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్సులో తిరుపతి బస్టాండుకు చేరుకుంది. బస్టాండు బయట ఉన్న ఆటోలను ఆశ్రయించి శివజ్యోతినగర్‌కు వెళ్లాలంటే రూ.150 అడిగారు. అడిగినంత ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. 80 కి.మీ.ల దూరం ఉన్న తిరుపతి- నాయుడుపేట ప్రయాణానికి ఇద్దరు పెద్దలు, ఒక పాపకు సుమారు రూ.245లు ఛార్జీ చెల్లిస్తే.. బస్టాండు నుంచి 3.5 కి.మీ.ల దూరం ఉన్న శివజ్యోతినగర్‌కు రూ.150 ఆటోకు ఇవ్వాల్సి వచ్చింది.

ఆర్టీసీ బస్టాండు నుంచి అర కిలో మీటరు దూరం కూడా లేని రైల్వేస్టేషన్‌కు రూ.80 వసూలు చేస్తున్నారు.

రోజూ లక్ష మంది ఆటోలను ఆశ్రయించే తిరుపతిలో నిర్దిష్ట విధానం అమలు లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏ ఆటోకు మీటర్లు ఉండవు. ఎంత వసూలు చేసినా అడిగే వారు లేరు. కొవిడ్‌ ముందు ఆటోలకు మీటర్లు ఏర్పాటు చేసి ఛార్జీలు నిర్ణయించారు. అవి కొంత కాలమే నడిచాయి. ఇంధనం ధరలు పెరిగాయంటూ మీటర్ల వినియోగాన్ని పక్కన పెట్టారు. నిర్ణయించిన ఛార్జీలకు మించి వసూలు చేయడం మొదలుపెట్టారు.

సంఘాల అండ

నగరంలో అధికార, అనధికారికంగా సుమారు 17 వేల ఆటోలు నడుస్తున్నాయి. కార్మిక సంఘాల పేరుతో యూనియన్లు.. స్టాండ్లు ఏర్పాటు చేసుకుని ఛార్జీలు నిర్ణయిస్తున్నారు. ఒక ఆటో మరో ప్రాంతంలో ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశం లేకుండా.. ఆ ప్రాంతానికి వచ్చిన ప్రయాణికులు అక్కడి ఆటోలోనే ఎక్కేలా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇలా వీధికో స్టాండు ఏర్పాటు చేశారు. అందుకు అండగా ఉంటే యూనియన్లకు నెలవారీగా సొమ్ము చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పట్టించుకోని ట్రాఫిక్‌ పోలీసులు

ప్రయాణికుల దోపిడీని పట్టించుకోకుండా.. జరిమానాలు, ఇతర వసూళ్లలో ట్రాఫిక్‌ పోలీసులు బిజీగా ఉంటున్నారు. కొన్ని కూడళ్లలో ఆటో యూనియన్లు ట్రాఫిక్‌ పోలీసులకు మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకుని జరిమానాలు వేయకుండా వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


మూణ్ణాళ్ల ముచ్చటగా ప్రీపెయిడ్‌ ట్యాక్సీ కౌంటర్‌

మూతపడ్డ ప్రీపెయిడ్‌ ఆటో కౌంటర్‌

ఆటోల దోపిడీ నుంచి యాత్రికులను కాపాడేందుకు రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రీపెయిడ్‌ ట్యాక్సీ కౌంటర్‌ మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసుల విశ్రాంతి కేంద్రంగా మారింది. నగర విస్తీర్ణం తక్కువైనా మీటర్ల ఏర్పాటు చేపడితేనే దోపిడీ తగ్గుతుంది. ప్రవేశపెట్టిన త్రిచక్ర యాప్‌ను అమలు చేస్తే ఆటోలపై నిఘా ఉంటుంది. నగరంలో ఎక్కడా ఆటో ఛార్జీల ధరల పట్టిక కనిపించదు.


ఛార్జీల మోత వాస్తవమే

ఛార్జీల మోత వాస్తవమే. ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఫ్లైఓవర్‌ పూర్తి అయ్యాక మీటర్లు, ధరల విషయంపై ప్రత్యేక నిఘా పెడతాం. దోపిడీకి గురైన ప్రయాణికులు, యాత్రికులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

బారిక నరసప్ప, ట్రాఫిక్‌ డీఎస్పీ, తిరుపతి




 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని