logo

ఊరించి.. కొర్రీలతో వంచించి

మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్‌, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు.

Published : 29 Mar 2024 02:17 IST

ఒప్పంద అధ్యాపకుల శాపనార్థాలు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్‌, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు ఇచ్చి.. సవాలక్ష నిబంధనలతో ఆఖరువరకు ఉరుకులు పరుగులు తీయించి.. చివరకు ఉద్యోగాల భర్తీకిగాను పదిహేనేళ్ల కిందట ఇచ్చిన పేపరు ప్రకటన జత చేయాలంటూ ప్రొసీడింగ్స్‌ దస్త్రం పక్కన పడేయడంపై వారంతా శాపనార్థాలు పెడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ప్రభుత్వ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులుగా 3,652 మంది పనిచేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 530 మంది వరకు కొనసాగుతున్నారు. చాలీచాలని జీతంతో ఏళ్లతరబడి సేవలు అందించారు. ఒప్పంద ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమించేందుకు ప్రభుత్వం 114 ఉత్తర్వు జారీచేసి ఆదిలోనే కొందరిని అనర్హులను చేసిందనే విమర్శలు సర్వత్రా వినిపించాయి. శాశ్వత అధ్యాపకులుగా పనిచేస్తున్నవారు రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటుండగా తాము వారికంటే ఎక్కువ పనిగంటలు పనిచేస్తున్నా అందుకు తగ్గ వేతనాలు అందడం లేదని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. ఇంటర్‌ విద్యాశాఖలో విషయ అవగాహనలేని మంత్రులు, అధికారులు చేతగానితనంతోనే తాము శాశ్వత ఉద్యోగులుగా అవకాశాలు కోల్పోతున్నామని వారంతా ఆరోపిస్తున్నారు. ఇదేరీతిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 386 మంది ఒప్పంద అధ్యాపకులుగా అతితక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. తితిదే పాలక మండలి సమావేశంలోనూ ఒప్పంద అధ్యాపకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదని.. ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 196 మంది టైం స్కేల్‌ ఉద్యోగులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని