logo

దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!

అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు.

Published : 29 Mar 2024 02:26 IST

ఏకంగా రూ.3 కోట్ల విలువైన భూమి చదును

తిరుపతి (గ్రామీణ), న్యూస్‌టుడే: అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. చివరకు దేవుణ్ని ముందుపెట్టి తమ కబ్జాల దాహం కొనసాగించడంపై చెర్లోపల్లి వాసుల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడ ఏకంగా రూ.3 కోట్ల విలువచేసే కాలువ భూమిని పూడ్చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

తిరుపతి గ్రామీణ మండలం కొత్త చెర్లోపల్లి సమీపంలో సర్వే నం.123లో కాలువ పోరంబోకు ఉంది. భారీవర్షాలు వస్తే పొలాల్లో నిలిచే నీళ్లు ఈ కాలువ మీదుగా పేరూరు చెరువులోకి వెళ్లేవి. ఫలితంగా పంటలను వరదనీటి నుంచి సంరక్షించుకోడానికి రైతులకు అవకాశం ఉండేది. 70 నుంచి వంద అడుగుల వరకు విస్తరించిన ఈ కాలువపై అధికార పార్టీ నాయకులు కన్నేశారు. ఇక్కడ ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయం నిర్మించాలని చిన్న షెడ్డు ఏర్పాటుచేసి ఏకంగా వందడుగుల కాలువను చదునుచేసి మహాభారతం నిర్వహించారు. తర్వాత ఆలయం పునరుద్ధరించాలని పెద్ద బోర్డు ఏర్పాటుచేసి 600 నుంచి 700 అడుగుల పొడవుతో ఎకరం కాలువ భూమిని చదును చేసి మట్టితో నింపేశారు. దీని పక్కనే ఉన్న స్థలాల్లో స్థిరాస్తి వ్యాపారులు అంకణం రూ.లక్షకు ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారు. ఆలయానికి ఏకంగా కాలువనే చదును చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పరిశీలించి చర్యలు: కొత్త చెర్లోపల్లి వద్ద కాలువ పరిశీలనకు సిబ్బందిని పంపిస్తామని, ఆక్రమించి ఉంటే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ మహబూబ్‌ చాంద్‌బీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని