logo

దేవుడా.. పోస్టల్‌ బ్యాలెట్‌కూ కష్టపడాలా..!

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది.. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి కలెక్టరేట్‌లో ఐదు గంటలకుపైగా క్యూలో నిల్చొన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు కలిగి.. 

Published : 06 May 2024 04:59 IST

కలెక్టరేట్‌లో ఐదు గంటలు క్యూలో ఉద్యోగులు
ఆర్వో కేంద్రాల జాబితాలో కనిపించని  ఎన్నికల సిబ్బంది పేర్లు
అదనపు కౌంటర్ల ఏర్పాటులో యంత్రాంగం జాప్యం

చిత్తూరు పివికెన్‌ కళాశాలలో మండుటెండలో ఉద్యోగుల నిరీక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌, పుత్తూరు, చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది.. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి కలెక్టరేట్‌లో ఐదు గంటలకుపైగా క్యూలో నిల్చొన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు కలిగి.. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు కలెక్టరేట్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గంటల సేపు క్యూలో నిల్చోవడంతో కాళ్లనొప్పులతో వణికిపోయారు. ఉక్కపోతతో చెమటలు కక్కారు. తాగునీటికి కటకటలాడారు ఎన్నికల విధుల్లోని సిబ్బంది. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం, దీనిపై హెల్ప్‌డెస్క్‌లో ఉన్న సిబ్బందికి ఏం సమాధానం చెప్పాలో తెలియకపోవడంతో పలుచోట్ల ఓటింగ్‌పై ప్రభావం చూపింది.

తిరుపతి జిల్లా ఓటర్లకు ఒకే కౌంటర్‌ ఏర్పాటు చేయటంతో తోపులాట

ఇతర జిల్లాల్లో ఓటు కలిగి.. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు, అత్యవసర సేవల్లోని ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి కలెక్టరేట్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహాత్మా జ్యోతిబా ఫులే భవనం.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కౌంటర్‌లో తిరుపతి, అన్నమయ్య జిల్లాలు మినహా.. మిగిలిన జిల్లాల్లో ఓటు ఉన్నవారికి కేటాయించారు. మొదటి అంతస్తులోని కౌంటర్‌లో అన్నమయ్య జిల్లా వారికి, రెండో అంతస్తులో తిరుపతి జిల్లా వారికి కౌంటర్లు ఇచ్చారు. ఉదయం 9.30 నుంచి అన్ని కౌంటర్ల వెలుపల ఉద్యోగులు గంటల తరబడి క్యూలో నిల్చొన్నారు. డిక్లరేషన్‌ ఫాం తీసుకుని ఓటు వేసి బయటకు రావడానికి నాలుగు గంటలు పట్టింది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల కౌంటర్‌ ముందు క్యూ పెరిగిపోవడంతో అసహనానికి లోనయ్యారు. కౌంటర్ల తనిఖీకి వచ్చిన కలెక్టర్‌ షన్మోహన్‌ ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు.

పేరు లేదంటూ..!

తన ఓటు ఏమయిందని సిబ్బందిని ప్రశ్నిస్తున్న ఉద్యోగి

మే 13న పోలింగ్‌ విధుల్లో పాల్గొనాల్సిన ఎన్నికల సిబ్బంది పేర్లు.. చిత్తూరు, నగరి, పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లోని పోస్టల్‌ బ్యాలెట్‌ జాబితాలో లేకపోవడంపై వారు తీవ్రంగా స్పందించారు.
చిత్తూరులోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఫాం-12, ఫాం-12డి ఓటర్లు 3,002 మంది ఉన్నారు. పోలింగ్‌ డ్యూటీ ఆర్డర్‌, ఓటరు కార్డుతో హెల్ప్‌ డెస్క్‌కు వచ్చిన ఉద్యోగులు.. ముందుగా తమ ఓటరు కార్డు నంబర్‌ చెప్పి జాబితాలో చూసుకోగా.. చాలామంది పేర్లు కనిపించలేదు. హెల్ప్‌డెస్క్‌ సిబ్బంది సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అక్కడే కూర్చున్నారు. హెల్ప్‌ డెస్క్‌ తనిఖీ చేసేందుకు వచ్చిన చిత్తూరు ఆర్వో, జేసీ శ్రీనివాసులుకు ఉద్యోగులు చెప్పడంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ విధుల ఆర్డరు, ఓటరు కార్డు చూసి డిక్లరేషన్‌ ఫాం ఇవ్వాలని ఆదేశించడంతో హడావుడిగా ఇచ్చారు. పోలింగ్‌ సిబ్బంది వివరాలు మాన్యువల్‌గా నమోదు చేశారు. చిత్తూరు ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు వినియోగానికి ఆరు కౌంటర్లు చాలక ఓటింగ్‌ ప్రక్రియ చాలా ఆలస్యమైంది.

జాబితాలో పేరు లేక..

జీడీనెల్లూరు కేంద్రంలోనూ ఓటరు జాబితాలో పేరులేని విషయం వెలుగుచూసింది. కార్వేటినగరం మండలానికి చెందిన ఓ ఉద్యోగి శ్రీకాళహస్తిలో పనిచేస్తున్నారు. ఓటు వినియోగానికి వచ్చిన ఆయనకు ఇక్కడ జాబితాలో పేరు లేదని చెప్పడంతో ఖంగుతిని అధికారుల్ని ప్రశ్నించాడు. సోమవారం  అవకాశం కల్పిస్తామని చెప్పడంతో వెనుదిరిగాడు.

మధ్యాహ్నం తర్వాత అదనపు కౌంటర్లు

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పీలేరుకు చెందిన ఉద్యోగులకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో.. చంద్రగరి, సత్యవేడుకు చెందిన ఉద్యోగులకు స్వామి వివేకానంద భవనం వెనకున్న కమాండ్‌ కంట్రోల్‌ సెల్‌లో అదనపు కౌంటర్‌ కేటాయించడంతో పోలింగ్‌ కాస్త మెరుగుపడింది.


ఎన్నికల విధుల్లో ఉన్నా తమకు ఓటు హక్కులేదని చిత్తూరు ఆర్‌.ఓ శ్రీనివాసులుతో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ ఓటర్లు

  • నగరి నియోజకవర్గానికి సంబంధించి ఫెసిలిటేషన్‌ కేంద్రం పుత్తూరులోని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల. ఇక్కడ 1,194 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి. హెల్ప్‌ డెస్క్‌లో సచివాలయ సిబ్బందిని నియమించారు. ఓటరు జాబితాలో పేరు లేని వారికి ఏం వివరణ ఇవ్వాలన్న అవగాహన లేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలింగ్‌ 10.10కి ప్రారంభమైంది. నగరిలో పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి ఓటుకు రూ.2 వేలు, పుంగనూరులో ఓటుకు రూ.3 వేలు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి.
  • పూతలపట్టు జడ్పీ ఉన్నత పాఠశాల ఫెసిలిటేషన్‌ కేంద్రంలోకి వైకాపా అభ్యర్థి సునీల్‌తోపాటు అనుచరులు దూసుకురాగా పోలీసులు అనుచరుల్ని అనుమతించలేదు. ఈ కేంద్రాన్ని కలెక్టర్‌ షన్మోహన్‌ తనిఖీ చేశారు. బందోబస్తును ఏఎస్పీ ఆరిఫుల్లా పర్యవేక్షించారు. పూతలపట్టులో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఒక్కో ఓటుకు అధికార పార్టీ రూ.2 వేలు ఇచ్చినట్లు సమాచారం.
    పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ఈ నెల 6, 7, 8 తేదీల్లోనూ అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని