logo

జగనన్న జమానా.. పన్నులతో హైరానా

పుత్తూరు పట్టణానికి చెందిన వీరయ్యకు గతంలో రూ.2,500 ఇంటి పన్ను చెల్లించేవాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారిత విధానంతో పన్ను విధించడంతో రూ.4,500 చెల్లించాలని పురపాలక సంఘ అధికారులు అతడికి డిమాండ్‌ నోటీసు అందించారు.

Updated : 10 May 2024 05:55 IST

ఆస్తి విలువ ఆధారిత విధానంతో ఏటా పెంపు
ప్రతి ఇంటిపైనా అదనంగా వడ్డింపు
ఏటా ప్రజలపై రూ.5కోట్ల భారం

  • పుత్తూరు పట్టణానికి చెందిన వీరయ్యకు గతంలో రూ.2,500 ఇంటి పన్ను చెల్లించేవాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారిత విధానంతో పన్ను విధించడంతో రూ.4,500 చెల్లించాలని పురపాలక సంఘ అధికారులు అతడికి డిమాండ్‌ నోటీసు అందించారు. ఈ పన్ను ఏటా 15 శాతం పెంచుతూ పోతున్నారు. ఈ ఏడాది అతడు పన్ను కింద రూ.5,650 చెల్లించాల్సి వచ్చింది. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇంటి పన్ను చెల్లించేందుకే తనకు వచ్చే ఆదాయం సరిపోతుందని అతడు వాపోయాడు.
  • చిత్తూరు నగరానికి చెందిన ఓబయ్య గత ప్రభుత్వ హయాంలో రూ.1,200 ఇంటి పన్ను చెల్లించేవాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారిత విధానంతో పన్ను విధానం ప్రవేశపెట్టడంతో ప్రస్తుతం ఏటా ఆయన పన్ను రూపంలో రూ.1,560 చెల్లిస్తున్నాడు. గత రెండేళ్లలో అతడి ఇంటి పన్ను పెరుగుతూ వస్తోంది.

న్యూస్‌టుడే, పుత్తూరు, చిత్తూరు నగరం: ఇంటి పన్ను నోటీసులు చూసి పట్టణ, నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు.. కనీస పరిశీలన లేకుండా కొత్త విధానం తెచ్చిన వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా భారం వేసి ఏటా 15శాతం చొప్పున పెంచి ముక్కుపిండి వసూలు చేస్తోంది.. అలాగని పౌరసేవలు, కాలనీల్లో వసతులు మెరుగుపరుస్తున్నారా.. అంటే అదీ లేదు..  ఏటా ఆస్తి ఆధారిత పన్నుల విధానంతో రూ.5కోట్లు భారం పడుతోంది.

అన్నీ బాదుడే.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదో సంక్షేమ పథకాలకు డీబీటీ విధానంలో ప్రజలను ఆదుకుంటున్నట్లు కలరింగ్‌ ఇస్తోంది. అన్నింటిపై పన్నులు వేసి గుంజుతున్నారు. గతంలో ఇంటి విస్తీర్ణం, నిర్మాణం తీరు.. ఇంటిలో సొంత యజమానులు ఉన్నారా.. అద్దెకు ఇచ్చారా.. ఇలా ప్రత్యక్ష పరిశీలన జరిపి పన్ను విధించేవారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక 2022 నుంచి ఆస్తి విలువ ఆధారంగా మదింపు చేసి అమాంతంగా ప్రజలపై భారం పెంచారు. ఇందుకు జియో బేస్డ్‌ సర్వే నిర్వహించి నిర్మాణాలు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల విలువను రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి సేకరించారు. దాని ఆధారంగా పన్ను భారం మోపారు. పెరిగిన మొత్తం ఒకే సారి విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఏటా 15శాతం చొప్పున పెంచుతూ వచ్చారు. ఇందులో మతలబేంటంటే గతంలో రూ.2,500 విధిస్తే ఏటా 15 శాతం చొప్పున రూ.2500కు చేరే వరకు భారం పెరుగుతూనే ఉంటుంది. ఈ విషయమై కనీస సమాచారం లేకుండా గృహ యజమానులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం ఎందుకు పెరిగిందో తెలియక చాలామంది పురపాలిక, నగరపాలక సంస్థ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. తగ్గించాలని వినతులు అందజేశారు. అవన్నీ బుట్టదాఖలయ్యాయే తప్ప మార్పులేకపోడం గమనార్హం.

పెరిగేదే తప్ప తగ్గేదికాదు..

ప్రభుత్వం ఏటా ఆగస్టులో భూముల విలువను 5 నుంచి 10 శాతం వరకు పెంచుతోంది. మున్సిపాలిటీలు, నగర పాలికలు ఏ ఏడాదికా ఏడాది పెరిగిన భూ విలువను ఆధారంగా చేసుకుని పన్ను విధిస్తాయి. నూతన పన్ను విధానం ప్రకారం ఏటా భారం పెరుగుతూ ఉంటుంది తప్ప ఇది ఎప్పటికీ తగ్గేదికాదు.


కనీస వసతులు లేవు..

మా గ్రామంలో ఇప్పటికీ కాలువలు నిర్మించలేదు. మున్సిపాలిటీ ఏర్పడ్డాక ఏడాదికి రెండుసార్లు పన్ను వసూలు చేస్తున్నారు. వైకాపా అధికారంలో వచ్చాక ఆస్తి విలువ ఆధారిత పన్ను విధిస్తున్నారు. గడిచిన ఐదేళ్లుగా ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదు. అయినా పెంచిన పన్ను చెల్లించక తప్పలేదు. సేవలు అందించకుండా పన్ను పెంచడం దారుణం

సంతోష్‌, మిట్టపల్లూరు, పుత్తూరు మున్సిపాలిటీ


సామాన్యులే సమిధలు..

వైకాపా అధికారంలోకి వచ్చాక ఆస్తిపన్నే కాదు. కొత్తగా చెత్తపన్ను విధించారు. భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, విద్యుత్తు ఛార్జీలు అన్నీ పెంచేశారు. సామాన్యులు ఎలా బతకాలి. పాత పన్నుల విధానం బాగుండేది. ఇంటి నిర్మాణాన్ని బట్టి పన్ను విధించేవారు. ప్రస్తుతం అందరిపై భారం మోపారు.  కనీస వసతులు కల్పించడం లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

గాలి గోపీనాథ్‌, పుత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు