logo

ఏం జరిగింది..?

ముడి చక్కెరను విదేశాల నుంచి దిగుమతి చేసి.. శుద్ధి చేసి మళ్లీ ఎగుమతి చేసే పరిశ్రమ.. కార్మికులంతా పనుల్లో నిమగ్నమ య్యారు. శుద్ధిచేసిన పంచదార బస్తాలు లారీల్లో లోడింగ్‌ చేసే క్రమంలో మొబైల్‌ కన్వేయర్‌కు విద్యుత్తు సరఫరా

Published : 20 Aug 2022 06:18 IST

ఇద్దరిని కబళించిన ప్యారీలో పేలుడు

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, సర్పవరం జంక్షన్‌: ముడి చక్కెరను విదేశాల నుంచి దిగుమతి చేసి.. శుద్ధి చేసి మళ్లీ ఎగుమతి చేసే పరిశ్రమ.. కార్మికులంతా పనుల్లో నిమగ్నమ య్యారు. శుద్ధిచేసిన పంచదార బస్తాలు లారీల్లో లోడింగ్‌ చేసే క్రమంలో మొబైల్‌ కన్వేయర్‌కు విద్యుత్తు సరఫరా అందించే ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.. కి.మీ. వరకు ఈ శబ్దం వినిపించింది.. అంతా ఉలిక్కిపడి తేరుకునేలోగా.. ప్రమాద ప్రాంతంలో ఓ కార్మికుడి కాలు, చెయ్యి తెగిపడి విగతజీవుడైతే.. మరో పది మంది కాలిన గాయాలతో రక్తపు మడుగులో విలవిల్లాడుతూ కనిపించారు. ఓ వ్యక్తిని వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో కన్నుమూశారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ పరిశ్రమలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ పరిశ్రమలో పంచదార బస్తాలను లారీల్లోకి ఎత్తే గోదాము ప్రాంగణంలో త్రీఫేస్‌ మెయిన్‌ స్విచ్‌బోర్డు (ఎంసీబీ) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

భయంతో పరుగులు..

వీరంతా రోజువారీ కూలీలు ఓ లాజిస్టిక్‌ కంపెనీ గుత్తేదారు ఆధ్వర్యంలో వివిధ మండలాల నుంచి ఇక్కడికొచ్చి నిత్యం శ్రమిస్తుంటారు. 11-17 మంది చొప్పున ఒక బృందంగా ఏర్పడి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా పంచదార బస్తాలను లారీల్లోకి ఎక్కించి, సర్దుతుంటారు. బస్తాకు రూ.2 చొప్పున వీరికి రోజువారీ కూలీ దక్కుతున్నట్లు సమాచారం. అనూహ్యంగా విద్యుత్తు బోర్డు వద్ద ప్రమాదం జరగడంతో భయంతో ఇతర కార్మికులు బయటకు పరుగులు తీశారు.

ఎందుకంత జాప్యం..?

ప్యారీ పరిశ్రమలో ఉదయం సుమారు 10.20 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. 12.21 గంటలకు సమాచారం అందిందని సర్పవరం పోలీసులు చెబుతున్నారు. సంఘటనలో రాయుడు వీరవెంకట సత్యనారాయణ (36) ఎడమ చెయ్యి, కుడికాలు తెగిపడిందనీ.. ముఖం మొత్తం కాలిపోయిందని కార్మికులు తెలిపారు. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు.. గాయపడిన వారిని కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించామన్నారు. ప్రమాద సమాచారాన్ని పోలీసులతోపాటు బాధితుల కుటుంబ సభ్యులకూ సకాలంలో తెలియజేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆరు గంటల ఆందోళన...

పరిశ్రమలో ప్రమాదంతో ఆగ్రహించిన కార్మికులు.. ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల మద్దతుతో ఆందోళనకు దిగారు. పరిశ్రమ గేట్లు తోసుకుని లోనికి చొరబడే ప్రయత్నం చేశారు. ముందస్తుగా కాకినాడ డీఎస్పీ భీమారావు, సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు, ప్రత్యేక బలగాలు మోహరించి కట్టడి చేశారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిశ్రమ ఎదుట దశల వారీగా బైఠాయించారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఎంత సర్దిచెప్పినా ఆందోళన విరమించలేదు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటల తర్వాత చర్చలకు పిలవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ప్రమాద కారణమేంటి..?

ప్యారీ పరిశ్రమలో ప్రమాదానికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగిందని పరిశ్రమ సిబ్బందితోపాటు పోలీసులు వెల్లడించారు. విద్యుదాఘాతంతో ఆస్థాయిలో పేలుడుకు ఆస్కారం లేదనే వాదన సంబంధిత శాఖ నిపుణుల నుంచి వినిపిస్తోంది. అక్కడ పేలుడు సామగ్రి ఆనవాళ్లు కనిపించలేదని ఘటనా స్థలాన్ని తనిఖీచేసిన అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రమాదానికి కారణం ఏంటనే చర్చ సాగుతోంది. కర్మాగారాల తనిఖీ విభాగం, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌, అగ్నిమాపక శాఖల సంయుక్త తనిఖీ నివేదిక బహిర్గతమైతే తప్ప ప్రమాదానికి అసలు కారణం తెలిసే వీలులేదు.

అంతర్గతంగా ఉత్పత్తి చేసుకున్న విద్యుత్తుతో పరిశ్రమ నడుస్తోంది. విద్యుదాఘాతం సమయంలో గోదాములో చెలరేగుతున్న చక్కెర దుమ్ము పేలుడుకు కారణం అయి ఉండొచ్చన్నది ప్రాథమికంగా గుర్తించామని కర్మాగారాల తనిఖీ విభాగం డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణ ‘ఈనాడు’తో చెప్పారు. ఎంసీబీ దగ్గర విద్యుత్తు తీగ తెగి స్పార్క్‌ అవ్వడంతో చక్కెర ధూళి కణాల కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు.

నివేదిక ఆధారంగా చర్యలు

లోడింగ్‌ పాయింట్‌ దగ్గర విద్యుదాఘాతంతో పేలుడు జరిగింది. ఇద్దరు చనిపోగా... మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక, విద్యుత్తు, పరిశ్రమలు, ఇతర శాఖల బృందంతో అధ్యయనం చేసి పేలుడుకు కారణాలు తెలుసుకుంటాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ, కాకినాడ జిల్లా

మృతుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి..

ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే యాజమాన్యం తరఫున ఉన్నారే తప్ప బాధితుల పక్షాన నిలవలేదనీ..మృతుల కుటుంబాలకు రూ.కోటి,క్షతగాత్రులకు పూర్తి వైద్యం.. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూస్థానిక ఎమ్మెల్యేకు ఈ పరిశ్రమలో కాంట్రాక్టులు ఉన్నాయని చెబుతున్నారనీ... ఉంటే ఉండొచ్చు కానీ ప్రమాదాల వేళబాధితుల పక్షాన నిలవాలన్నారు.

న్యాయం చేస్తాం..

మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ఈ పరిశ్రమలో ఎప్పుడూ ప్రమాదాలు జరగలేదనీ..బాధితులకు యాజమాన్యం ద్వారా పరిహారం అందించాలని చెప్పామనీ..ముఖ్యమంత్రికీ వివరించిన్యాయం చేస్తామన్నారు.

చెప్పలేని దయనీయం

కొత్తపల్లి: కొండెవరంవాసి.. రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36). ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. పిల్లలు.. ఒకరు పదోతరగతి, మరొకరు ఏడోతరగతి చదువుతున్నారు. యథావిధిగా శుక్రవారం ఉదయం పరిశ్రమలో పని చేయడానికి వెళ్లిన సత్యనారాయణ ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. ఆయన భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. భర్త మృతి విషయం కుటుంబసభ్యులు ఆమెతో చెప్పలేకపోయారు. ఈవిషయం చెబితే ఆమె ఏమవుతుందో అని భయపడుతూ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

తల్లడిల్లిన మనసులు

సామర్లకోట గ్రామీణం: వేట్లపాలెం సుభాష్‌ నగర్‌వాసి.. వీరమళ్ల రాజేశ్వరరావు. ఆయనకు భార్య సత్యవేణి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె నాగదేవికి వివాహం కాగా కుమారులు సురేంద్ర, శ్రీరాం చిరు ఉద్యోగాలు చేస్తున్నారు. శుక్రవారం ఇంటి ఎదురుగా ఉన్న అమ్మవారి ఆలయంలో పూజ చేసుకుని విధులకు వెళ్లారు. అంతలోనే మృతి సమాచారం అందటంతో కుటుంబికులు బోరున విలపిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ.. ఆప్యాయంగా పలకరించే రాజేశ్వరరావు ఇక లేరని నమ్మలేక పోతున్నామని స్థానికులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని