icon icon icon
icon icon icon

Sam Pitroda: వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవర్సీస్‌ ఛైర్మన్‌ పదవికి శామ్‌ పిట్రోడా రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీ ఓవర్సీస్‌ ఛైర్మన్‌ పదవికి శామ్‌ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఖర్గే ఆమోదించారు.

Updated : 08 May 2024 19:57 IST

దిల్లీ: ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఓవర్సీస్‌ ఛైర్మన్‌ శామ్‌పిట్రోడా (Sam Pitroda) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల వారసత్వ పన్నుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి మరువక ముందే తాజాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది.

‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్‌ పిట్రోడా

వరుస వివాదాలు..

  • భారత్‌లోని భిన్నత్వం గురించి పిట్రోడా మాట్లాడుతూ జాతి వివక్ష వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ‘‘తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమవాసులు అరబ్బులుగా.. ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా’’ కన్పిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడుతున్నారు.
  • వారసత్వ పన్నుపై.. ఇటీవల కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం పిట్రోడా వారసత్వ పన్నుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. ఇది న్యాయంగానే ఉంది’’ అని అన్నారు. 
  • రామమందిరంపై 2023 జూన్‌లో ఆయన రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్య, ఆరోగ్య సమస్యలను దేవాలయాలు పరిష్కరించలేవని అన్నారు. దేశవ్యాప్తంగా రామాలయం ప్రారంభోత్సవం కోసం ఎదురుచూసిన వేళ ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది.
  • 1984లో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లకు అనుకూలంగా 2019 మేలో పిట్రోడా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.
  • పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్‌.. పాకిస్థాన్‌ భూభాగంలోని బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపి ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. భారత వైమానిక దాడుల సామర్థ్యంపై ఆయన అనుమానం వ్యక్తంచేస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. సైన్యాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది.
  • భారత రాజ్యాంగ రూపకల్పనలో బీఆర్‌ అంబేడ్కర్‌ కంటే.. భారత తొలి ప్రధాని నెహ్రూ పాత్రే ఎక్కువంటూ పిట్రోడా పెట్టిన సోషల్‌ మీడియా పోస్టు తీవ్ర వివాదానికి దారితీసింది.

పిట్రోడా వ్యాఖ్యలు.. భాజపాకు అస్త్రాలు..

పిట్రోడా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల వేళ భాజపాకు అస్త్రాలుగా మారుతున్నాయి. ఇటీవల వారసత్వ పన్నుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్మును కాంగ్రెస్‌ నేతలు లాక్కోవాలనుకుంటున్నారని విమర్శించింది. ఇక పిట్రోడా చేసిన తాజా వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోందని.. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తానెప్పటికీ సహించబోనని ప్రధాని హెచ్చరించారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img